Share News

యూఎస్ ఓపెన్: టోర్నీ నుంచి అల్కరాజ్ ఔట్.. సెమీస్‌కు షెల్టన్

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:48 PM

యూఎస్ ఓపెన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా టెన్నిస్ స్టార్ బెన్ షెల్టన్ చేతిలో ఐదు సెట్ల హోరాహోరీ పోరులో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

యూఎస్ ఓపెన్: టోర్నీ నుంచి అల్కరాజ్ ఔట్.. సెమీస్‌కు షెల్టన్
US Open 2026

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్ ఓపెన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. అమెరికా టెన్నిస్ స్టార్ బెన్ షెల్టన్ చేతిలో ఐదు సెట్ల హోరాహోరీ పోరులో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. నాలుగు గంటల 28 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో షెల్టన్‌పై 6-7(5), 6-1, 6-3, 1-6, 7-6(7) తేడాతో అల్కరాజ్ పరాజయం పాలయ్యాడు. అయితే అల్కరాజ్‌పై షెల్టన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.


తొలి సెట్‌ నుంచే ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. టై బ్రేక్‌లో 7-5తో పైచేయి సాధించిన అల్కరాజ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే ఆ తర్వాత షెల్టన్‌ తన పవర్‌ గేమ్‌తో విరుచుకుపడ్డాడు. రిటర్న్‌ పొజిషన్‌ను ముందుకు మార్చి.. బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో అల్కరాజ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. రెండో సెట్‌ను ఏకంగా 6-1తో గెలుచుకున్నాడు. మూడో సెట్‌లోనూ అదే దూకుడును కొనసాగించిన షెల్టన్‌.. కీలక బ్రేక్‌ సాధించి 6-3తో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో మ్యాచ్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లాడు.


పుంజుకున్న అల్కరాజ్‌..

మ్యాచ్‌ చేజారిపోతున్న దశలో అల్కరాజ్‌ తనదైన ఆటను చూపించాడు. నాలుగో సెట్‌లో బేస్‌లైన్‌ నుంచి షాట్లు కొడుతూ షెల్టన్‌పై ఒత్తిడి పెంచాడు. వరుస పాయింట్లతో దూసుకెళ్లి 6-1తో సెట్‌ను గెలిచి మ్యాచ్‌ను నిర్ణాయత్మక ఐదో సెట్‌కు తీసుకెళ్లాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఐదో సెట్‌లో సర్వ్‌ను ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. దీంతో మ్యాచ్ సూపర్ టై బ్రేక్‌కు చేరింది. చివరకు 10-7 తేడాతో షెల్టన్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. అయితే నాలుగు గంటల 28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ పూర్తి అయ్యే వరకు తెల్లవారుజామున 3.33 నిమిషాలు అయింది. దీంతో యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలోనే అత్యంత ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌గా ఇది రికార్డుకెక్కింది. ఈ విజయంతో షెల్టన్‌ తన కెరీర్‌లో రెండోసారి గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. అల్కరాజ్‌ మాత్రం యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను నిలబెట్టుకునే అవకాశాన్ని కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.


ఇవి కూడా చదవండి:

కోహ్లీ వన్8 బ్రాండ్ షూ ధరించిన పాకిస్థాన్ క్రికెటర్లు.. వీడియో వైరల్

పాక్ క్రికెట్ బాగు కోసం నేనేమీ చేయలేకపోతున్నా: వసీం అక్రమ్

Updated Date - Sep 09 , 2026 | 01:48 PM