Share News

మహారాష్ట్ర అసెంబ్లీలో టీమిండియా స్టార్ తిలక్ వర్మ

ABN , Publish Date - Jun 23 , 2026 | 09:24 PM

టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ మహారాష్ట్ర అసెంబ్లీలో సందడి చేశాడు. అతడి బాల్య స్నేహితుడు విక్రమ్ కాకడే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు.

మహారాష్ట్ర అసెంబ్లీలో టీమిండియా స్టార్ తిలక్ వర్మ
Tilak Varma Maharashtra Assembly

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ మహారాష్ట్ర అసెంబ్లీలో సందడి చేశాడు. అతడి బాల్య స్నేహితుడు విక్రమ్ కాకడే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు. ఈ కార్యక్రమానికి తిలక్ వర్మ మంగళవారం హాజరయ్యాడు. తన ప్రాణమిత్రుడు ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో అడుగుపెట్టడంపై తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. విక్రమ్ ఎమ్మెల్సీ కావడం తనకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని తెలిపాడు. చిన్నప్పటి నుంచి విక్రమ్ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నాడని, ప్రజాసేవలో అతను మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని ఆకాంక్షించాడు.


ఇదే సమయంలో క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై తిలక్ స్పందిస్తూ.. రాబోయే ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాము ప్రపంచకప్ గురించి కాకుండా, ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే ద్వైపాక్షిక సిరీస్‌లపైనే పూర్తి దృష్టి సారించామని స్పష్టం చేశాడు. నిరంతరం శ్రమిస్తూ, ప్రతిరోజూ ఆటను మెరుగుపరుచుకోవడమే ప్రస్తుత తమ లక్ష్యమని వివరించాడు. ఇదిలావుండగా, మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో అధికార 'మహాయుతి' కూటమి రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 17 స్థానాలకు గానూ.. ఏకగ్రీవాలతో కలుపుకుని ఏకంగా 16 స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చింది.


జూన్ 18న జరిగిన పోలింగ్ ఫలితాలు సోమవారం విడుదల కాగా, అందులో బీజేపీ సింహభాగం సీట్లను సాధించింది. బీజేపీ ఒంటరిగానే 11 స్థానాలను గెలుచుకోగా, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 3 స్థానాలను, అజిత్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) 2 స్థానాలను సొంతం చేసుకున్నాయి. మిత్రుడి రాజకీయ విజయాన్ని పంచుకోవడానికి తిలక్ వర్మ రావడంతో అసెంబ్లీ ప్రాంగణంలో క్రీడా, రాజకీయ వర్గాల ఆసక్తికర కలయిక కనిపించింది.


ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

Updated Date - Jun 23 , 2026 | 09:55 PM