Share News

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

ABN , Publish Date - Jun 23 , 2026 | 08:02 PM

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ అరుదైన గౌరవం లభించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును ఇవాళ అందుకున్నాడు.

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
Rohit Sharma Padma Shri

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును ఇవాళ (జూన్‌ 23) అందుకున్నాడు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును రోహిత్ శర్మ అందుకున్నాడు. ఈ ఏడాది జనవరిలోనే రోహిత్‌తో పాటు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌కు కూడా పద్మశ్రీ ప్రకటించారు. ఆమె గత నెలలో అవార్డు అందుకోగా తాజాగా రోహిత్ శర్మ ఈ గౌరవాన్ని స్వీకరించాడు.


గత కొన్నేళ్లుగా భారత జట్టుకు రోహిత్ అందించిన సేవలు, అతని నాయకత్వంలో జట్టు సాధించిన విజయాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. ఈ కార్యక్రమానికి పలువురు ఇతర రాజకీయ ప్రముఖులు, టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, నటుడు మమ్ముట్టి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ కూడా హాజరయ్యారు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ జట్టు టీ20 ప్రపంచకప్‌2024 టైటిల్ గెలుచుకోవడంతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. అలానే అతడి నాయకత్వంలో భారత జట్టు 2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌కు కూడా చేరుకుంది.


పద్మశ్రీ అందుకున్న భారత క్రికెట్ ప్రముఖుల జాబితాలో తాజాగా రోహిత్ కూడా చేరాడు. ఇప్పటికే క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌, రన్ మెషీన్ విరాట్‌ కోహ్లీ, రాహుల్‌ ద్రవిడ్‌, గౌతమ్‌ గంభీర్‌, కపిల్‌ దేవ్‌, ఎంఎస్‌ ధోని వంటి దిగ్గజాలు ఈ గౌరవాన్ని అందుకున్నారు. హామ్‌స్ట్రింగ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఈ టీమిండియా మాజీ కెప్టెన్ త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. శుభ్‌మన్‌ గాల్‌ నాయకత్వంలోని భారత జట్టు జూలై 14 నుంచి 19 వరకు జరిగే మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

క్రిస్ గేల్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పొలార్డ్.. ఎందుకంటే..

Updated Date - Jun 23 , 2026 | 08:06 PM