ధనాధన్... దంచెయ్!
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:23 PM
భారత్‌లో క్రికెట్‌ను ఓ ఆటగా కాకుండా, మతంగా భావించడం పరిపాటి. మరి.. అదే నేల ఏకంగా టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిస్తుంటే ఇక ఆ జోష్ గురించి వేరే చెప్పాలా? దునియాను కట్టిపడేసేందుకు వచ్చేసిన ఈ ధనాధన్ విశ్వపోరును వీక్షించేందుకు కోట్లాదిమంది అభిమానులు సిద్ధమయ్యారు.
భారత్‌లో క్రికెట్‌ను ఓ ఆటగా కాకుండా, మతంగా భావించడం పరిపాటి. మరి.. అదే నేల ఏకంగా టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిస్తుంటే ఇక ఆ జోష్ గురించి వేరే చెప్పాలా? దునియాను కట్టిపడేసేందుకు వచ్చేసిన ఈ ధనాధన్ విశ్వపోరును వీక్షించేందుకు కోట్లాదిమంది అభిమానులు సిద్ధమయ్యారు. పైగా ఈసారి టీమిండియా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగబోతోంది. మొత్తంగా 20 జట్లు, 55 మ్యాచ్‌లతో నెల రోజులపాటు సాగే ఈ ఉత్కంఠభరిత సమరంలో పటిష్ట జట్లు సత్తా చూపుతాయా? లేక పసికూనలు సంచలన ప్రదర్శనతో షాకులిస్తాయా? అనేది వేచిచూడాల్సిందే..
రెండేళ్లు కూడా పూర్తికాకుండానే క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు టీ20 వరల్డ్‌కప్ వచ్చేసింది. ప్రతీ క్రికెటర్ ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలని కలలు కనే టోర్నమెంట్ ఇది. అంతేనా.. ప్రతీ జట్టు చాంపియన్ అనిపించుకునేందుకు శక్తిమేరా పోరాడే అద్భుత ఈవెంట్. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2024లో విండీస్, యూఎస్‌ఏ ఆతిథ్యమిచ్చిన విశ్వకప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టే విజేతగా నిలిచింది. మనోళ్ల ఖాతాలో అది రెండో కప్. 2007 ఆరంభ టోర్నీలో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో యువ జట్టు చాంపియన్‌గా నిలిచాక మళ్లీ 17 ఏళ్ల తర్వాత కానీ కప్‌ను ముద్దాడలేదు. తాజాగా జరుగబోయేది పదో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్. మరోవైపు శ్రీలంకకు 2012లో, భారత్‌కు 2016లోనూ ఈ మెగా టోర్నీని నిర్వహించిన అనుభవం ఉంది.
ఆదరణ పెంచుకునేందుకు..
పురుషుల టీ20 వరల్డ్‌కప్ రెండేళ్లకోసారి జరుగుతుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దీన్ని పర్యవేక్షిస్తుంటుంది. అయితే క్రికెట్ పుట్టుక మాత్రం సంప్రదాయక టెస్టులతో జరిగింది. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు అంటే 1971లో ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం (ఎంసీసీ)లో తొలి వన్డే జరిగింది. కాలక్రమేణా నేటి యువత ఆలోచనలకు తగ్గట్టు ఆటలో మరింత జోష్‌ను తెచ్చేందుకు మార్పులు తప్పలేదు. రోజుల తరబడి క్రీజులో నిలవడం కాకుండా, కొన్ని గంటల్లోనే అదీ ఫటాఫట్ ఆటతీరుతో ఫలితం తేలిపోయే సరికొత్త ఫార్మాట్‌కు తెర లేచింది. అప్పటికే ఇంగ్లండ్ కౌంటీల్లో టీ20లు సంచలన ఫలితాలను సాధిస్తున్నాయి. దీంతో ఐసీసీ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఈ ఫటాఫట్ పోరును ప్రవేశపెట్టింది.
2005లో మొదటిసారి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత రెండేళ్లకే 2007లో దక్షిణాఫ్రికాలో తొలి ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 జరిగింది. అక్కడి నుంచి ఇంగ్లండ్ (2009), విండీస్ (2010), శ్రీలంక (2012), బంగ్లాదేశ్ (2014), భారత్ (2016)లో టోర్నీలు నిర్వహించాయి. అనంతరం సుదీర్ఘ విరామం రాగా 2020లో ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వాల్సింది. అయితే కరోనా నియంత్రణలో భాగంగా తమ సరిహద్దు మూసివేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో విదేశీ జట్లు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ టోర్నీ ఆతిథ్యాన్ని భారత్ (యూఏఈలో నిర్వహించారు)కు.. 2022 టోర్నీని ఆస్ట్రేలియాకు మార్చారు. ఇక 2007 నుంచి 2018 వరకు ఈ టోర్నీని ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 పేరిట నిర్వహించడం గమనార్హం. మరోవైపు ఆరంభ టోర్నీలోనే భారత్ విజేతగా నిలవడంతో ఈ పొట్టి ఫార్మాట్‌కు ఎనలేని ప్రాముఖ్యత ఏర్పడింది. ఇక అక్కడి నుంచి పొట్టిక్రికెట్‌పై అభిమానుల మక్కువ ఆకాశాన్నంటింది. ఈ క్రేజ్‌ను చూసే దాదాపుగా అన్ని క్రికెట్ ఆడే దేశాలు కూడా ఫ్రాంచైజీ లీగ్‌లు నిర్వహిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఏకంగా టెస్టులు, వన్డేల మనుగడకే ప్రమాదం తెచ్చే స్థాయికి ఈ ఫార్మాట్ ఎదిగింది.
2016లో తొలిసారిగా..
భారత్‌లో వన్డే ఫార్మాట్‌లో నాలుగు సార్లు వరల్డ్‌కప్ జరిగినప్పటికీ.. టీ20 విశ్వపోరుకు మాత్రం ఒక్కసారే ఆతిథ్యమిచ్చింది. 2016లో తొలిసారి భారత గడ్డపై ఈ టోర్నీని ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 పేరిట మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించారు. ఇందులో 16 జట్లు పాల్గొన్నాయి. అప్పటికి పది శాశ్వత సభ్య దేశాలైన భారత్, ఆస్ర్టేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, విండీస్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత సాధించాయి. అలాగే 2015 ఐసీసీ టీ20 క్వాలిఫయర్స్ ద్వారా అఫ్ఘానిస్థాన్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఒమన్, స్కాట్లాండ్, హాంకాంగ్ మిగిలిన స్థానాలను భర్తీ చేశాయి. మరోవైపు భారత్‌లో అడుగుపెట్టడానికి ముందే పాక్ జట్టు తమ భద్రతా నిపుణులను పంపి ఏర్పాట్లను పర్యవేక్షించింది.
అలాగే అక్కడి ప్రభుత్వం కూడా తమ జట్టు భారత్‌లో ఆడేందుకు అనుమతించింది. ఇక భారత్-పాక్ మ్యాచ్ ముందుగా ధర్మశాలలో ఆడాల్సి ఉండగా పీసీబీ కోరిక మేరకు కోల్‌కతాకు మార్చారు. ఇక టోర్నీని మూడు దశలుగా ఆడించగా, ర్యాంకింగ్స్ ప్రకారం టాప్-8లో ఉన్న జట్లు నేరుగా సూపర్-10 దశకు అర్హత సాధించాయి. మిగిలిన 8 జట్లు గ్రూప్ దశలో పోటీపడి, ఇందులో నుంచి బంగ్లా, అఫ్ఘాన్ సూపర్-10లో ప్రవేశించాయి. వీటిని ఐదు జట్ల చొప్పున రెండు గ్రూప్‌లుగా విభజించారు. అనంతరం సెమీస్‌లో కివీస్-ఇంగ్లండ్, విండీస్-భారత్ ఆడగా.. తుది పోరుకు విండీస్-ఇంగ్లండ్ వెళ్లాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో విండీస్ నాలుగు వికెట్ల తేడాతో నెగ్గి చాంపియన్‌గా అవతరించింది. అటు స్వదేశీ అభిమానుల మద్దతుతో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కివీస్‌పై మాత్రమే ఓడి సెమీస్‌కు వెళ్లింది. కానీ నాకౌట్‌లో కరీబియన్లు షాక్ ఇచ్చారు. విరాట్ కోహ్లీ 273 పరుగులతో టోర్నీలో రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలావుండగా.. 2021లో ఆతిథ్య హక్కులు భారత్‌వే అయినా.. కొవిడ్ కారణంగా యూఏఈ, ఒమన్‌లో మ్యాచ్‌లను ఆడించాల్సి వచ్చింది.
ఆతిధ్య జట్టు ఎంపిక ఎలా?
2026 టీ20 వరల్డ్‌కప్ భారత్, శ్రీలంకలో జరుగుతుందని ఐదేళ్ల క్రితమే ఐసీసీ ప్రకటించింది. 2024-2031 ఐసీసీ పురుషుల ఈవెంట్స్ సైకిల్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదట ఈ టోర్నీకి శ్రీలంక మాత్రమే ఆతిథ్యమివ్వాలని ప్రతిపాదించారు. కానీ టోర్నమెంట్ విస్తృతితో పాటు ఆ దేశంలో ఉన్న స్టేడియాల కొరత కారణంగా బీసీసీఐతో కలిసి సంయుక్తంగా కలిసి నిర్వహించాలని ఐసీసీ తలచింది. మరోవైపు 2024 డిసెంబరులో బీసీసీఐ, పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య జరిగే ఐసీసీ మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరగాల్సి ఉంటుంది.. ఫలితంగా పాక్ జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ కొలంబోలో జరుగుతాయి.
టాప్-8 జట్లకు నేరుగా అర్హత
2007 నుంచి 2012 వరకు 12 జట్లు మాత్రమే టీ20 ప్రపంచకప్‌ల్లో పాల్గొన్నాయి. ఆ తర్వాత 2014-2022 మధ్య జరిగిన నాలుగు విశ్వకప్‌ల్లో ఈ సంఖ్య 16కు పెరిగింది. ఈ స్థితిలో టోర్నీకి మరింత ఆదరణ తెచ్చే క్రమంలో 2024లో కరీబియన్, యూఎస్‌ఏలో జరిగిన మెగా టోర్నీని 20 జట్లతో ఆడించారు. ప్రస్తుతం కూడా అదే పద్దతి కొనసాగుతోంది. చివరి టోర్నీలో టాప్-8గా నిలిచిన జట్లకు నేరుగా అర్హత కల్పించారు. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్, విండీస్, యూఎస్‌ఏలతో పాటు ఆతిథ్య జట్ల హోదాలో భారత్, శ్రీలంక ఉన్నాయి. అలాగే టీ20 టీమ్స్ ర్యాంకింగ్స్ ఆధారంగా కివీస్, పాకిస్థాన్, ఐర్లాండ్‌లను చేర్చారు. ఇందులో బంగ్లాదేశ్ కూడా ఉండగా... భారత్‌లో భద్రతా కారణాలను సాకుగా చూపి వైదొలగడంతో స్కాట్లాండ్‌కు అనుమతి లభించింది. ఇక రీజినల్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా నమీబియా, జింబాబ్వే (ఆఫ్రికా), నెదర్లాండ్, ఇటలీ (యూరప్), కెనడా (అమెరికా), నేపాల్, ఒమన్, యూఏఈ (ఆసియా) వరల్డ్‌కప్ బెర్త్ పట్టేశాయి. ఇలా మొత్తం 20 జట్లు మెగా టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం కాబోతున్నాయి. అలాగే ఈ జట్లన్నంటిలోనూ ఇటలీకిదే తొలి వరల్డ్‌కప్ కానుండడం విశేషం.
ఫార్మాట్ ఎప్పటిలానే..
మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా కేటాయించారు. ప్రతీ గ్రూప్‌లో ఐదేసి జట్లు ఉంటాయి. ఒక్కో టీమ్ కూడా తమ గ్రూప్‌లో ఉన్న మిగతా వారితో మ్యాచ్ ఆడుతుంది. అలాగే ఆయా గ్రూప్‌ల్లో టాప్-2గా నిలిచిన 8 జట్లు సూపర్-8లో ప్రవేశిస్తాయి. ఇక్కడ నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూప్‌లుగా విడిపోతాయి. అలాగే ప్రతీ టీమ్ తమ గ్రూప్‌లోని మిగతా మూడు జట్లతో పోటీ పడతాయి. దీంతో పాయింట్ల పరంగా ఆయా గ్రూప్‌ల్లో టాప్-2గా నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌లోకి వెళతాయి. ఆ తర్వాత సెమీస్‌లో గెలిచిన రెండు టీమ్స్ తుది పోరుకు అర్హత సాధించి చాంపియన్ ఎవరో తేల్చుకుంటాయి.
రెండు దేశాలు.. 55 మ్యాచ్‌లు
భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్‌లో మొత్తంగా 55 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో భారత్ నుంచి ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుండగా.. శ్రీలంకలో కొలంబో, పల్లెకెలె మైదానాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తంగా లంకలో గ్రూప్, సూపర్-8 కలిపి 20 మ్యాచ్‌లున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే.. కోల్‌కతాలో ఆరు, ముంబైలో సెమీస్‌తో కలిపి ఎనిమిది, చెన్నైలో ఏడు, అహ్మదాబాద్, ఢిల్లీల్లో ఆరేసి మ్యాచ్‌లను నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 8న ఫైనల్ మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగాల్సి ఉంది. ఒకవేళ పాక్ ఫైనల్‌కు వస్తే ఈ వేదికను కొలంబోకు మారుస్తారు.
ఆటకు ముందే వివాదాలు
టీ20 ప్రపంచకప్‌నకు ముందు బంగ్లాదేశ్ వ్యవహారం కలకలం రేపింది. దీనికి పరోక్షంగా బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఐపీఎల్ కారణం కావడం గమనార్హం. కొంతకాలంగా ఇరు దేశాల మధ్య దౌత్య, రాజకీయ సంబంధాలు క్షీణిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి హిందువులపై ఊచకోతలకు నిరసనగా భారత ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇదిలావుండగా గతేడాది చివర్లో జరిగిన వేలంలో ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.9.20 కోట్లకు తీసుకుంది. దీంతో బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతుంటే అదే దేశ ప్లేయర్‌ను లీగ్‌లో ఎలా కొనసాగిస్తారంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈనేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను లీగ్ నుంచి తొలగిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అటు ఈ నిర్ణయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) టీ20 వరల్డ్‌కప్ కోసం తమ జట్టు భారత్‌లో పర్యటించదంటూ తెగేసి చెప్పింది. అంతేకాకుండా ఆటగాళ్ల భద్రత దృష్ట్యా వెంటనే వేదికలను శ్రీలంకకు మార్చాల్సిందిగా ఐసీసీని కోరింది. అయితే బంగ్లా ఆటగాళ్లకు భారత్‌లో ఎలాంటి ప్రమాదం లేదని ఐసీసీ ఆ వినతిని తోసిపుచ్చి, ఏ విషయం తేల్చాల్సిందిగా 24 గంటలపాటు అల్టిమేటం విధించింది. అయినా బీసీబీ తన మంకుపట్టు వీడకపోవడంతో బంగ్లాపై వేటు వేసి ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఇక బంగ్లాకు మద్దతుగా పాకిస్థాన్ తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామంటూ బీరాలు పలకడం విస్మయపరిచింది. అయితే కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించడంతో దెబ్బకు దిగొచ్చింది.
- ఆర్.నరేందర్ గౌడ్
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. నిలకడగా ధరలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ధి సభకు హాజరైన సల్మాన్ ఖాన్
Read Latest Telangana News and National News