Share News

IND VS SL: భారత్‌ - ఏ 265 పరుగులకు ఆలౌట్..

ABN , Publish Date - Jun 15 , 2026 | 02:36 PM

ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక-ఏ జట్టుకు భారత్-ఏ 266 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది.

IND VS SL: భారత్‌ - ఏ 265 పరుగులకు ఆలౌట్..
India A vs Sri Lanka A

స్పోర్ట్స్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇవాళ(సోమవారం) శ్రీలంక ఏ జట్టుతో భారత్-ఏ జట్టు తలపడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. సూర్యాంశ్ (72), విప్రాజ్ నిగమ్ (51) హాఫ్‌ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. అయితే శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించక ముందే 10/0 స్కోరుతో లక్ష్య ఛేదనను ప్రారంభించనుంది. భారత బ్యాటర్ విప్రాజ్‌ నిగమ్ పిచ్ మధ్యలో పరిగెత్తడంతో అంపైర్లు పది పరుగులను పెనాల్టీగా విధించారు. ఆ స్కోరును శ్రీలంక ఇన్నింగ్స్‌కు కలపగా.. ఆ జట్టు లక్ష్యం ప్రస్తుతం 50 ఓవర్లలో 256 పరుగులు అవుతుంది.


మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 21 పరుగులు) మంచి ఆరంభమే ఇచ్చాడు. దూకుడుగా ఆడే క్రమంలో వనుజా సహన్ బౌలింగ్‌లో షిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వైభవ్‌ పెవిలియన్‌కు చేరాడు. మరికాసేపటికే ప్రభ్‌ సిమ్రన్ (11) కూడా ఔటయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ (23), వైస్‌ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (37) కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు.


అయితే లంక స్పిన్నర్ల దెబ్బకు స్వల్ప వ్యవధిలో వారిద్దరూ ఔటయ్యారు. ఆ తర్వాత ఆయుష్ బదోని (15), నిషాంత్ సింధు (6) వెనువెంటనే ఔట్ కావడంతో భారత్ సగం ఓవర్లకే ఆరు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సూర్యాంశ్‌ షెడ్జే, విప్రాజ్‌ నిగమ్ జోడీ దాదాపు 15 ఓవర్ల పాటు వికెట్‌ పడకుండా ఆడ్డుకున్నారు. ఎనిమిదో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఆఖర్లో అనవసరంగా విప్రాజ్‌ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. శ్రీలంక బౌలర్లలో విజయ్‌కాంత్, షిరాజ్ చెరో మూడు వికెట్లు సాధించారు. సహన్, ముతులన్, వనుజా సహన్ తలో వికెట్ తీశారు.


ఈ మ్యాచ్‌లో ఇరుజట్లకు కలిపి మూడు పెనాల్టీలు పడ్డాయి. అందులో శ్రీలంకకు ఒకటి.. భారత్‌కు రెండు ఎదురయ్యాయి. శ్రీలంక బౌలింగ్‌ చేస్తుండగా.. బంతి వికెట్ల వెనుక కీపర్‌ హెల్మెట్‌ను తాకింది. భారత్‌కు ఐదు పరుగులు కలిసి వచ్చాయి. అలానే భారత బ్యాటర్ విప్రాజ్‌ రెండుసార్లు డేంజర్‌ ఏరియాలోకి రావడంతో పెనాల్టీలు పడింది. దీంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించకుండానే 10 పరుగులు శ్రీలంక ఖాతాలోకి చేరాయి.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ

IND vs SL: మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ!

Updated Date - Jun 15 , 2026 | 03:00 PM