ప్లేయర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి.. బీసీసీఐకు గావస్కర్ సూచన
ABN , Publish Date - Jun 23 , 2026 | 01:03 PM
భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ బీసీసీఐకి పలు కీలక సూచనలు చేశాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌ల్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గావస్కర్ పలు అంశాలను ప్రస్తావించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ బీసీసీఐకి పలు కీలక సూచనలు చేశాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌ల్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గావస్కర్ పలు అంశాలను ప్రస్తావించాడు. వరుస సిరీస్‌లతో బిజీగా మారిన భారత ప్లేయర్లకు ప్రతి ఏడాది ఒక నెలపాటు విశ్రాంతి ఇవ్వాలని సూచించాడు. ప్రతి సిరీస్‌కు భారత జట్టులో మార్పులు చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు.
‘అఫ్గానిస్థాన్, జింబాబ్వే, శ్రీలంక వంటి దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తూ వస్తోంది. వారి క్రికెట్ అభివృద్ధికి, ఆర్థికంగా బలోపేతం కావడానికి సిరీస్‌లు ఆడుతోంది. ఇది మంచి విషయమే. అయితే మన ప్లేయర్ల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. వారికి ఏడాదిలో కనీసం ఒక నెలపాటు తప్పనిసరిగా విశ్రాంతి ఇవ్వాలి. భారత్‌కు ప్రతిభావంతులైన ఆటగాళ్ల కొరత లేదు. జట్టులో మార్పులు చేయడం అవసరమే.. కానీ కేవలం విశ్రాంతి తీసుకుంటున్న స్టార్ ప్లేయర్ల స్థానంలో కొత్త ఆటగాళ్లకు క్యాప్ అందించడం సరైంది కాదు. భారత జట్టులో చోటు సంపాదించుకోవాలి. అంతేగానీ జట్టులో ఖాళీ ఉంది కాబట్టి అవకాశం ఇవ్వకూడదు. అఫ్గాన్‌తో టెస్టులో మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ బుమ్రాకు ఎందుకు విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చింది? ఒకవేళ అతడిని జట్టులోకి తీసుకుని ఉంటే ఐదు లేదా పది వికెట్లు పడగొట్టేవాడు. గాయాలు లేనంత వరకు అత్యుత్తమ జట్టే బరిలోకి దిగాలి’ అని గావస్కర్ వెల్లడించాడు.
అభిమానులు అలసిపోయారు..
‘ఏడాది పొడవునా ఎక్కడో ఒక చోట భారత్ క్రికెట్ ఆడుతూనే ఉంది. వర్క్‌లోడ్ పేరుతో తరుచూ విశ్రాంతులు ఇవ్వడం తగ్గించాలి. వారి ప్లేస్‌లో కొత్త వాళ్లని తీసుకునే ప్రయోగాలు ఆపాలి. అఫ్గాన్‌తో లఖ్‌నవూ, చెన్నైలో జరిగిన చివరి రెండు వన్డేలకు స్టేడియాలు పూర్తిగా నిండలేదు. వరుసగా క్రికెట్ చూసి అభిమానులు కూడా అలసిపోయారు. యువ ప్లేయర్ల కోసం ‘ఎ’ జట్లు, అండర్-19 టోర్నీలు నిర్వహించండి. వారికి అవకాశాలు ఇవ్వండి. కానీ సీనియర్ ప్లేయర్లకు మాత్రం విరామం కల్పించడం అత్యవసరం. వచ్చే ఏడాది ఐపీఎల్‌ను ముందుగానే ముగించే ఆలోచన ఉంటే.. ఆ షెడ్యూల్‌లో ఒక నెల విశ్రాంతిని కూడా బీసీసీఐ అందులో చేర్చాలి’ అని గావస్కర్ సూచించాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ చేతికి టీమిండియా జెర్సీ.. ఈ అనుభూతిని వర్ణించలేనంటూ..
నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం