భారీ షాట్ల వల్ల వైభవ్ కెరీర్ ప్రమాదంలో పడుతుంది: సౌతాఫ్రికా క్రికెటర్
ABN , Publish Date - Jun 23 , 2026 | 08:51 AM
వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ.. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ మాత్రం వైభవ్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంక-ఎపై 11 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 29 బంతుల్లో 94 పరుగులు చేసి ఔరా అనిపించాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత్-ఎ 66 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీ ముద్దాడింది. వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ.. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ మాత్రం వైభవ్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు.
‘ఈ కుర్రాడి ఆటను చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. కానీ అతడి గాయాల నుంచి ఎవరూ మాట్లాడటం లేదు. 15 ఏళ్ల వయసులోనే భారీ బ్యాట్‌తో బలంగా షాట్లు ఆడుతున్నాడు. దీనివల్ల చేతి మణికట్టు, మోచేతులు, కీళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. వైద్య నిపుణులు దీనిపై ఏమంటారో తెలుసుకోవాలి. సచిన్ టెండూల్కర్ కెరీర్ కూడా ఒకానొక దశలో మోచేతి గాయం కారణంగా ప్రమాదంలో పడింది. వైభవ్ తరహాలో సచిన్ అంత బలంగా షాట్లు ఆడలేదు. కానీ అతడికే తప్పలేదు. వైభవ్ సూర్యవంశీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వరుస మ్యాచ్‌ల్లో భారీ షాట్లు బాదడం వల్ల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. వైభవ్ ఇంకా ఎదుగుదల దశలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో అధిక స్థాయిలో క్రికెట్ వల్ల కీళ్లు, లిగమెంట్లు, కండరాలపై ప్రభావం పడుతుంది. మేము తక్కువ బరువు ఉన్న బ్యాట్లు ఉపయోగించేవాళ్లం. ఇప్పటి తరహాలో ఇన్ని మ్యాచ్‌లు కూడా ఆడేవాళ్లం కాదు. గాయపడితే కోలుకోవడానికి సమయం ఉండేది. వైభవ్‌కు గొప్ప భవిష్యత్తు ఉంది. కానీ అతడి కెరీర్, ఆరోగ్యం విషయంలో నాకు ఆందోళన కలుగుతోంది’ అని డారిల్ కలినన్ వెల్లడించాడు.
కాగా, ఐపీఎల్ 2026లో 776 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన వైభవ్.. ట్రై సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. 15 ఏళ్లకే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలోనే ఐర్లాండ్‌తో రెండు టీ20లు, అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ పాల్గొననున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్: ఎంబాపె జోరు.. నాకౌట్‌కు ఫ్రాన్స్
వన్డే ప్రపంచ కప్‌లో రో-కో ఆడతారు: కైఫ్