Share News

సెలక్షన్ కమిటీకి చికిత్స అవసరం: సొంత అల్లుడికి కెప్టెన్సీపై షాహిద్ అఫ్రిది విమర్శలు

ABN , Publish Date - Mar 17 , 2026 | 07:22 AM

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓటములకు, విమర్శలకు అలవాటు పడింది. సొంత జట్టుపైనే మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సెలక్షన్ కమిటీపై మండిపడ్డాడు. ఎవరికి కెప్టెన్సీ ఇవ్వాలో కూడా తెలియడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సెలక్షన్ కమిటీకి చికిత్స అవసరం: సొంత అల్లుడికి కెప్టెన్సీపై షాహిద్ అఫ్రిది విమర్శలు
Shahid Afridi

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓటములకు, విమర్శలకు అలవాటు పడింది. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలోనూ పేలవ ప్రదర్శన కనబర్చి సూపర్ 8 దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ కోల్పోయింది. సొంత జట్టుపైనే మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సెలక్షన్ కమిటీపై మండిపడ్డాడు. ఎవరికి ఏ ఫార్మాట్ కెప్టెన్సీ ఇవ్వాలో కూడా తెలియడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే పాక్ వన్డే జట్టుకు కెప్టెన్ స్వయాన తన అల్లుడు షాహీన్ అఫ్రిది కావడం గమనార్హం.


‘టీ20 ప్రపంచ కప్‌లో పాక్ ప్రదర్శన చూశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలోనూ వన్డే సిరీస్‌ను కోల్పోయాం. నా అభిప్రాయం ప్రకారం.. పాక్ సెలక్షన్ కమిటీ విమర్శలకు అర్హత సాధించింది. కమిటీలోని సభ్యులకు బాగా క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. కానీ ఇప్పటికీ మీకు ఏ ఫార్మాట్‌కు ఎవరిని కెప్టెన్‌గా నియమించాలో తెలియదు. జాతీయ జట్టులో మార్పులు అంటూ ఇప్పటి వరకు చాలా ప్రయోగాలు చేశారు. కేవలం కొన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచులను మాత్రమే ఆడిన యువ క్రికెటర్లను తీసుకుంటారు. వారికేమో అనుభవం సరిపోదు. దేశవాళీ క్రికెట్ వ్యవస్థే దారుణంగా తయారైంది. పాక్ జాతీయ జట్టుకు నాణ్యమైన క్రికెటర్లను అందించేంత స్థాయి దానికి లేదు’ అని షాహిద్ అఫ్రిది అన్నాడు.


అత్యంత చెత్త నిర్ణయాలివి..

‘సంస్కరణలు, మార్పులు పేరిట సెలక్టర్లు తీసుకునే నిర్ణయాలు అత్యంత చెత్తగా ఉన్నాయి. వన్డే గణాంకాలు బాగున్నా ప్లేయర్‌ను టీ20 ప్రదర్శన ఆధారంగా పక్కన పెట్టడమనే దిక్కుమాలిన చర్యలు ఏంటో అర్థం కావట్లేదు. చికిత్స జట్టుకు కాదు.. ముందు సెలక్షన్ కమిటీకి అవసరం. సీనియర్లను పక్కన పెట్టి అతికొద్ది ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కుర్రాళ్లను తీసుకున్నారు. వారేమో తమ ప్లేస్‌లను సుస్థిరం చేసుకోవాలని భావిస్తారే తప్పా.. జట్టు విజయాల కోసం ఆడటం లేదు. ఇలాగే కొనసాగితే ప్రతి కప్‌లోనూ ఓడిపోవడం అలవాటుగా మారిపోతుంది’ అని షాహిద్ అఫ్రిది విమర్శలు గుప్పించాడు.


ఇవి కూడా చదవండి:

అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!

Updated Date - Mar 17 , 2026 | 07:22 AM