టీ20ల్లోనే సౌకర్యంగా ఉంది
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:16 AM
కెరీర్‌లో ఒక్క టెస్టు మాత్రమే ఆడిన కెప్టెన్ సూర్యకుమార్ టీ20 ఫార్మాట్ అత్యంత సౌకర్యవంతంగా ఉందని చెబుతున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు టీ20 వరల్డ్‌కప్ అందించిన...
కెప్టెన్ సూర్యకుమార్
న్యూఢిల్లీ: కెరీర్‌లో ఒక్క టెస్టు మాత్రమే ఆడిన కెప్టెన్ సూర్యకుమార్ టీ20 ఫార్మాట్ అత్యంత సౌకర్యవంతంగా ఉందని చెబుతున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు టీ20 వరల్డ్‌కప్ అందించిన మూడో కెప్టెన్‌గా సూర్య నిలిచిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టీమిండియాకు ఈ ఒక్క ఫార్మాట్‌లోనే ఆడుతున్న సూర్య గతంలో ఓ టెస్టుతో పాటు 37 వన్డేల్లోనూ బరిలోకి దిగాడు. టెస్టులకు దూరమై కేవలం టీ20ల్లోనే ఆడడంపై సూర్య స్పందిస్తూ.. ‘సుదీర్ఘ ఫార్మాట్‌లో నేనాడింది ఓ ఇన్నింగ్స్ మాత్రమే. కానీ టీ20ల్లో మాత్రం మాస్టర్‌ను అయ్యా. అందుకే ఇందులో ఆడడం నాకెంతో బాగుంది. అయినా జీవితంలో ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. దాదాపు పదేళ్లు ముంబై తరఫున నేను రంజీ ట్రోఫీ ఆడిన విషయం మరువరాదు. వన్డేల్లోనూ ఉత్తమంగా ఆడేందుకు ప్రయత్నించినా కుదరలేదు. టీ20లకు మాత్రం నా ఆట సరిపోయింది. అలాగని నాకు టెస్టుల్లో ఆడేందుకు ఆసక్తిలేదని కాదు. టెస్ట్ చాన్స్ వస్తే ఎవరైనా కాదంటారా’ అని బీసీసీఐ నమన్ అవార్డుల్లో పాల్గొన్న సూర్య తేల్చాడు.
ఇషాన్‌ను తీసుకోవడం కఠిన నిర్ణయం
రెండేళ్లుగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్‌ను ఇటీవల వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ అప్పటికి ఏడాదిగా జట్టుతో పాటే ఉంటున్న కీపర్ జితేశ్ శర్మను సెలెక్టర్లు పక్కనబెట్టారు. ఇదే విషయమై సూర్య స్పందిస్తూ.. ‘టాపార్డర్‌లో ఎటాకింగ్ బ్యాటర్ ఉండాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరింది. అలాగే కుడి-ఎడమ కాంబినేషన్ కూడా కావాలనుకుంది. అందుకే ఇషాన్ వైపు మొగ్గు చూపడంతో జితేశ్ స్థానం కోల్పోయాడు’ అని వివరించాడు.
రెండు, మూడు జట్లను ఎంపిక చేయవచ్చు
దేశంలో నైపుణ్యం కలిగిన యువ క్రికెటర్లకు కొదవ లేదని, వీరితో పరిమిత ఓవర్లలో రెండు, మూడు జట్లను కూడా తయారు చేయవచ్చని సూర్య అన్నాడు. దేశవాళీలతో పాటు ఐపీఎల్ కారణంగా వర్థమాన ఆటగాళ్ల ఆట గణనీయంగా మెరుగుపడిందని అభిప్రాయపడ్డాడు. ప్రతీ ఏడాది ఐపీఎల్ ద్వారా యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్న విషయాన్ని గుర్తుచేశాడు. అందుకే అపార నైపుణ్యం కలిగిన వీరితో రెండు, మూడు జట్లను కూడా ఎంపిక చేసి ఆడించే వెసులుబాటు ఉందన్నాడు.
ఇవి కూడా చదవండి:
అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు.. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!