Sarfaraz Khan: సర్ఫరాజ్ అరుదైన రికార్డు.. సచిన్‌కూ సాధ్యం కాలేదు..
ABN , Publish Date - Jan 08 , 2026 | 07:15 PM
టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. లిస్ట్-ఏ మ్యాచుల్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గురువారం పంజాబ్, ముంబై మధ్య జరిగిన మ్యాచులో ఈ ఫీట్ సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా ప్లేయర్, ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ లో విజృంభిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా ఇవాళ (గురువారం) పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మను ఉతికారేశాడు. అభిషేక్ వేసిన 16 ఓవర్‌లో సర్ఫరాజ్ 6, 4, 6, 4, 6, 4 బాది ఏకంగా 30 పరుగులు రాబట్టుకున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్ లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన ఇండియన్ ప్లేయర్ గా సర్ఫరాజ్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్ మహారాష్ట్ర ప్లేయర్ అభిజిత్ కాలే, బరోడా ఆల్ రౌండర్ అతీత్ షేత్(16 బంతుల్లో) పేరిట సంయుక్తంగా ఉండేది.
1995లో బరోడాపై 16బంతుల్లో అభిజిత్ కాలే అర్ధ సెంచరీ చేశాడు. అలాగే 2021లో ఛత్తీస్‌గఢ్‌పై అతీత్ షేత్ కూడా 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్‌లో సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం బాది వారిద్దరి రికార్డు బ్రేక్ చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు. మరోవైపు విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున సర్ఫరాజ్ ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. అతను ఆరు ఇన్నింగ్స్‌లలో 75.75 సగటుతో, 190.56 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేశాడు. డిసెంబర్ 31న గోవాపై 157 పరుగులు చేశాడు. అంతకు ముందు ఉత్తరాఖండ్‌పై ఒక హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. సర్ఫరాజ్(Sarfaraz Khan) చివరిగా నవంబర్ 2024లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడాడు.
అతను 2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏడు మ్యాచ్‌లలో 65.80 సగటుతో, 203.80 స్ట్రైక్ రేట్‌తో 329 పరుగులు చేసి ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2026 వేలంలో సర్ఫరాజ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అతని కనీస ధర అయిన రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక పంజాబ్ తో జరిగిన ఇవాళ్టి మ్యాచులో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ .. 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. అయితే దురదృష్టవశాత్తూ ముంబై కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 217 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. కేవలం 15 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి.. ముంబై ఓటమిని చవిచూసింది.
ఇవి కూడా చదవండి..
Punjab vs Mumbai: ఉత్కంఠ పోరులో పంజాబ్ సంచలన విజయం..
Hardik Pandya: హార్దిక్ పాండ్య సిక్సర్ల వర్షం .. భారీ స్కోరు చేసిన బరోడా..