షట్లర్లకు ‘సాయ్’ షాక్
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:41 AM
ఐరోపాలో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన మన షట్లర్లకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) చివరి నిమిషంలో నిధులు నిలుపుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది.
ఆసియాడ్ ఎఫెక్ట్ ?
ఐరోపా టూర్‌కు నిధులు కట్..!
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో ఘోరంగా విఫలమైన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు.. ఐరోపా పర్యటనలో మెరుగైన ప్రదర్శన కనబరచారు. జర్మనీలో జరిగిన హైలో ఓపెన్‌లో పీవీ సింధు, లక్ష్య సేన్ టైటిళ్లతో అదరగొట్టారు. అయితే, ఈ టూర్‌కు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం క్రీడాలోకాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఐరోపాలో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన మన షట్లర్లకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) చివరి నిమిషంలో నిధులు నిలుపుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. ఫండింగ్ లేకపోవడంతో మన ఆటగాళ్లు సొంతంగా ఆ ఖర్చులను భరాయించుకోవాల్సి వచ్చిందని జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.
యూరప్ టూర్‌లో గత నెలలో ఫిన్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీలో జరిగిన నాలుగు టోర్నీల్లో భారత షట్లర్లు పాల్గొన్నారు. అయితే, గత నెల 6 నుంచి వాంతాలో జరిగిన ఆర్కిటిక్ ఓపెన్‌కు ముందు.. ఈ టూర్‌కు నిధులు విడుదల చేయడం లేదంటూ సాయ్ షాకింగ్ విషయం తెలియజేసిందని సమాచారం. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వెతుక్కొనే సమయం లేక కొందరు షట్లరు ఇబ్బందులు పడినట్టు తెలిసింది. ఫిన్లాండ్‌లో జరిగిన ఆర్కిటిక్ ఓపెన్‌కి భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినా.. మిగతా టోర్నీలకు మాత్రం చేతులెత్తేయడంతో ప్రయాణ, వసతి, భోజన ఖర్చులను తమ జేబుల నుంచి చెల్లించాల్సి వచ్చిందట. కాగా, నిధులు లేకపోవడంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో అస్మిత చాలీహా, ఇషా రాణి బారువా లాంటి వర్ధమాన షట్లర్లు కోచ్‌లు లేకుండానే బరిలోకి దిగాల్సిన దుస్థితి. ఆర్కిటిక్ ఓపెన్‌లో 26 మంది భారత షట్లర్లు ఆడగా.. ఒడెన్స్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ నుంచి ఏడుగురు, పారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఏడుగురు, హైలో ఓపెన్ నుంచి తొమ్మిది మంది తప్పుకొన్నారు.
నిధుల నిలిపివేత అందుకేనా?
జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత షట్లర్లు ఒక్క వ్యక్తిగత పతకం కూడా సాధించలేక పోయారు. 2014 తర్వాత బ్యాడ్మింటన్‌లో ఇది అత్యంత పేలవ ప్రదర్శన. ఈ కారణంగానే నిధులు నిలిపివేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, వీటిని సాయ్ తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారం 30 రోజుల ముందు ఆయా టోర్నీల్లో పాల్గొనే ఆటగాళ్ల జాబితా, ప్రతిపాదనలు పంపకపోవడం వల్లే నిధులు నిలిచిపోయాయని సాయ్ వర్గాలు తెలిపాయి. కానీ, రాబోయే టోర్నీలకు నిధులను పునరుద్ధరించినట్టు పేర్కొన్నాయి. అయితే, ఐరోపా పర్యటనలో ప్లేయర్లు భరాయించిన ఖర్చులను తిరిగి చెల్లించే అవకాశం లేదని తెలుస్తోంది.
ఎప్పుడూ ఎదురు కాలేదు: సింధు
‘నిధులు విడుదల కాలేదని తెలిసి ఆశ్చర్యపోయా. ఇలాంటి చేదు అనుభవం నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు. ఎటువంటి అధికారిక సమాచారం కూడా లేదు. అయితే, నా వరకు ఫండింగ్ ఉంటేనే ఆడాలని అనుకోలేదు. టోర్నీల్లో పాల్గొనాలి.. మెరుగైన ప్రదర్శన కనబరచాలన్న దానిపైనే దృష్టంతా. అందుకే ఆ ఖర్చులు సొంతంగా భరాయించా. కొంతమేర ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ కూడా సాయం చేసింది. ఎలాంటి పరిస్థితులైనా.. నిధులు మాత్రం నిలుపుదల చేయకూడదు.
ఇవి కూడా చదవండి:
ఇక హర్దీప్ సింగ్ పురి ఎన్నిక ఏకగ్రీవమే!
ఇజ్రాయెల్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తాము: ట్రంప్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News