బోపన్నకు కలిసిరాని ‘రిటైర్మెంట్’ నిబంధన.. ఆ జాబితాలో దక్కని చోటు!
ABN , Publish Date - Oct 17 , 2026 | 07:39 PM
భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్నకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రకటించిన అత్యుత్తమ ప్రతిభావంతులైన క్రీడాకారుల (స్పోర్ట్స్పర్సన్స్ ఆఫ్ అవుట్‌స్టాండింగ్ మెరిట్-ఎస్ఓఎం) జాబితాలో అతడికి చోటు దక్కలేదు.
ఇంటర్నెట్ డెస్క్: భారత టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ మాజీ నంబర్ వన్ డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్నకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రకటించిన అత్యుత్తమ ప్రతిభావంతులైన క్రీడాకారుల (స్పోర్ట్స్పర్సన్స్ ఆఫ్ అవుట్‌స్టాండింగ్ మెరిట్-ఎస్ఓఎం) జాబితాలో అతడికి చోటు దక్కలేదు. జాతీయ క్రీడా పాలన నిబంధనలు-2026 ప్రకారం.. ఈ జాబితాలో స్థానం పొందాలంటే ప్లేయర్లు పోటీ క్రీడల నుంచి రిటైర్ అయి కనీసం ఏడాది పూర్తయి ఉండాలి. అయితే బోపన్న రిటైర్మెంట్ ప్రకటించి ఏడాది గడవకపోవడంతో అతడి దరఖాస్తును పరిగణనలోకి తీసుకోలేదు. 46 ఏళ్ల బోపన్న 2025 నవంబర్ 1న ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
బోపన్న తన కెరీర్‌కు 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత ముగింపు పలికాడు. అంతకుముందే 2023లో మొరాకోతో జరిగిన డేవిస్ కప్ పోరే భారత్ తరఫున తనకు చివరి మ్యాచ్ అని ప్రకటించాడు. అనంతరం అంతర్జాతీయ టెన్నిస్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఆపేసినా.. ఏటీపీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో మాత్రం కొనసాగాడు. చివరకు 2025 నవంబర్‌లో ఆటకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే బోపన్న తన పేరును జాబితాలో చేర్చాలని దరఖాస్తు చేయడంలో తప్పేమీ లేదని తెలుస్తోంది. తన అర్హతపై నిర్వాహకురాలు గీతా మిట్టల్‌ను సంప్రదించిన తర్వాత, టెన్నిస్ సమాఖ్య నుంచి అర్హుడేనన్న భరోసా లభించడంతోనే దరఖాస్తు సమర్పించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు వీడ్కోలు పలికిన 2024నే రిటైర్మెంట్గా పరిగణించడంపై గందరగోళం ఏర్పడి ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఏటీపీ టోర్నీల్లో కొనసాగినందున అతడి ప్రొఫెషనల్ కెరీర్ 2025 వరకు కొనసాగినట్లయింది.
తొలి శ్రేణిలో పేస్..
ఏఐటీఏ ప్రకటించిన ఎస్ఓఎం జాబితాలో మొత్తం 40 మంది ఉండనున్నారు. ఇందులో 20 మంది పురుషులు, 20 మంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఈ జాబితాలో చోటు కోసం 42 మంది పురుషులు, 28 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లియాండర్ పేస్‌కు తొలి శ్రేణిలో ఏకైక స్థానం లభించింది. పురుషుల, మిక్స్డ్ డబుల్స్‌లో కలిపి 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన పేస్ భారత టెన్నిస్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడు. మరో ప్రపంచ మాజీ నంబర్‌వన్ మహేశ్ భూపతి, ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన సానియా మీర్జా రెండో శ్రేణిలో ఉన్నారు. పురుషుల, మిక్స్డ్ డబుల్స్‌లో కలిపి 12 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన భూపతి.. మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన సానియా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 23 నుంచి 25 వరకు జరగనుండగా.. నవంబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి:
రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్.. పంజాబ్ తరఫున బరిలోకి..!
భారత్-విండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. భువీ రీఎంట్రీకి బ్రేక్ పడనుందా?