ఇంకా బాధగానే ఉంది.. ఆసియా గేమ్స్‌లో ఓటమిపై పీవీ సింధు పోస్ట్
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:09 AM
ఆసియా గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం సింధు ఆసియా క్రీడల నిర్వాహకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మళ్లీ తాజాగా ఎక్స్ వేదికగా నిరాశ వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో చైనా స్టార్ చెన్ యుఫీ చేతిలో సింధు పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం సింధు ఆసియా క్రీడల నిర్వాహకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 18 గంటల్లో 3 మ్యాచ్‌లు పెట్టడం వల్ల తగినంత విశ్రాంతి దొరకలేదని, దీంతో కాళ్లు కదలలేదని తెలిపింది. ఈ క్రమంలో మళ్లీ తాజాగా ఎక్స్ వేదికగా నిరాశ వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది. కీలక కోర్టులో వీడియో రివ్యూ సదుపాయం లేకపోవడాన్ని కూడా ప్రస్తావించింది.
‘ఆసియా గేమ్స్‌లో నా ప్రయాణం ముగిసింది. కానీ ఆ ఓటమి బాధ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నా. క్వార్టర్ ఫైనల్‌లో మ్యాచ్‌ను ముగించేందుకు దగ్గరగా వచ్చిన ఆ మూడు పాయింట్లు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దాని గురించే మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ ఉన్నా. ఆసియా గేమ్స్ లాంటి కీలక టోర్నీల్లో వీడియో రిఫరల్ సదుపాయం అందుబాటులో లేకపోవడం బాధాకరం. రెండో గేమ్‌లో కొన్ని కీలక లైన్ కాల్స్ తనకు అనుకూలంగా వచ్చి ఉంటే మ్యాచ్ పరిస్థితి మారేదేమో! 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. ఇది శరీరంపై ప్రభావం చూపింది’ అని సింధు వెల్లడించింది.
ఈ ఓటమి నా ప్రయాణాన్ని నిర్ణయించదు..
ఓటమితో బాధపడుతున్నప్పటికీ.. ఇప్పటివరకు సాగిన తన ప్రయాణంపై సింధు గర్వం వ్యక్తం చేసింది. ‘2014లో నా తొలి ఆసియా గేమ్స్ నుంచి ఇప్పటి నాలుగో ఆసియా గేమ్స్ వరకు.. 12 ఏళ్లుగా భారత్ కోసం నా సర్వస్వం ధారపోశాను. ఈ ప్రయాణం నాకు ఎంతో ప్రత్యేకమైనది. అందుకే ఈ క్షణాన్ని కూడా అనుభూతి చెందనివ్వాలి. ఒక్క బాధాకరమైన ఫలితం నా మొత్తం ప్రయాణాన్ని నిర్వచించలేదు. నా టీమ్‌తో కలిసి ఇప్పటికే జరిగిన తప్పులపై సమీక్షిస్తున్నా. వాటిని సరిదిద్దుకుంటా. నేను బాధపడుతున్నా.. అన్న మాట వాస్తవం. ఇంతగా బాధపడుతున్నానంటే ఇప్పటికీ నాకు ఈ ఆటపై అంతే ప్రేమ ఉందని అర్థం. నాకు ఇంకా గెలవాలనే కోరిక ఉంది. కోర్టులో నా సర్వస్వం ఇస్తూనే ఉంటా’ అని సింధు ధీమా వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి:
ఆసియా గేమ్స్: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు భారత్
కోహ్లీని అలా వదిలేయాలి.. మ్యాచ్‌లు సులువుగా గెలిపించేస్తాడు: గిల్