Share News

పాక్ ప్రధానితో ముగిసిన భేటీ.. కీలక విషయాలు వెల్లడించిన నఖ్వీ

ABN , Publish Date - Jan 26 , 2026 | 08:40 PM

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ భేటీ ముగిసింది. అనంతరం నఖ్వీ పలు అంశాలను వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే అంశంపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు.

 పాక్ ప్రధానితో ముగిసిన భేటీ.. కీలక విషయాలు వెల్లడించిన నఖ్వీ

స్పోర్ట్స్ డెస్క్: బంగ్లాదేశ్‌కు మద్దతుగా టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2026)ను బహిష్కరిస్తామంటూ బెదిరించిన పాకిస్థాన్‌ ఆదివారం తమ జట్టును ప్రకటించింది. అయితే, తాము టోర్నీలో పాల్గొనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సోమవారం పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌తో నఖ్వీ సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 30 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఈ క్రమంలో ఐసీసీ మెగా టోర్నీ ఆడే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నఖ్వీ(Mohsin Khan) పలు అంశాలను వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్‌-2026ను బహిష్కరించే విషయమై 'అన్ని అవకాశాలు' ఇంకా పరిశీలనలో ఉన్నాయని ధృవీకరించారు. ప్రధానితో జరిగిన సమావేశంలో తాను టీ20 ప్రపంచకప్-2026కు సంబంధించిన అంశాలను వివరించానని తెలిపారు.


ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనేది లేనిది జనవరి 30 (శుక్రవారం) లేదా ఫిబ్రవరి 2 (సోమవారం) నాటికి ఒక నిర్ణయం తీసుకోవాలని పరస్పర అంగీకారం కుదిరిందని నఖ్వీ తెలిపారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఐసీసీ టోర్నీలో పాల్గొని భారత్‌తో జరిగే మ్యాచులను మాత్రం బహిష్కరించే విషయాన్ని పాకిస్థాన్ పరిశీలిస్తోందట. అలానే ఒక వేళ టోర్నీలో ఆడితే అన్ని మ్యాచ్‌ల్లోనూ చేతులకు నల్ల బ్యాండ్‌లు ధరించాలని కూడా పీసీబీ భావిస్తోందని సమాచారం. అలానే టోర్నీలో తాము సాధించే ప్రతి విజయాన్ని బంగ్లాదేశ్‌ క్రికెట్ మద్దతుదారులకు అంకితం చేయాలని మరో ఆప్షన్ ను సిద్ధంగా ఉంచుకుందని తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో తమ మ్యాచులను భారత్‌లో ఆడేందుకు నిరాకరించినందుకు ఐసీసీ బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుండి తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాకు మద్దతుగా ఉన్న పాకిస్థాన్(Pakistan) కూడా ఈ మెగా టోర్నీలో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది.



ఇవి కూడా చదవండి:

మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్

అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ

Updated Date - Jan 26 , 2026 | 08:40 PM