Share News

చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:28 PM

టీమిండియా పేస్ బౌలింగ్ విజయాల వెనుక ఉన్న అసలు వ్యూహాన్ని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వెల్లడించాడు. జట్టులోని ప్రతి బౌలర్‌కు ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటాయని, అందుకే అందరితో ఒకే విధంగా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడి సూచనలు ఇస్తానని తెలిపాడు.

చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్
Morne Morkel

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా పేస్ బౌలింగ్ విజయాల వెనుక ఉన్న అసలు వ్యూహాన్ని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వెల్లడించాడు. జట్టులోని ప్రతి బౌలర్‌కు ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటాయని, అందుకే అందరితో ఒకే విధంగా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడి సూచనలు ఇస్తానని తెలిపాడు. శిక్షణ సమయంలో, వార్మప్‌ సెషన్లలో ఒక్కో బౌలర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తానని చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు వన్డేలో పేసర్లే అత్యధికంగా వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.


‘ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడటానికే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. జట్టుగా కూడా సమావేశమై మ్యాచ్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురుకావచ్చో చర్చిస్తాం. అయితే మా బౌలర్లందరికీ విభిన్నమైన నైపుణ్యాలు ఉన్నాయి. అందుకే ప్రాక్టీస్, వార్మప్ సమయంలో ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడతాను. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలపై చిన్న చర్చ జరుపుతాం. వాళ్లందరూ ప్రతిభావంతులే. తమ ఆట, ఎలా బౌలింగ్ చేయాలనే విషయంపై వారికి స్పష్టత ఉంది. చిన్న చిన్న అంశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే మా పని.


ఒక నెల వ్యవధిలోనే భారత జట్టు 12 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో బౌలర్లను జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో 10 వైట్‌బాల్ మ్యాచ్‌లతో పాటు రెండు టెస్టులు ఉన్నాయి. ఈ పర్యటన మాకు చాలా ముఖ్యమైనది. విదేశాల్లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. అందుకే ఈ టూర్‌లో మంచి క్రికెట్ ఆడాలని ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇలాంటి సుదీర్ఘ పర్యటనలకు ఎంతో ప్రణాళిక అవసరం. ప్రతి మ్యాచ్‌కు ముందు అక్కడి పరిస్థితులను అంచనా వేయాలి. పిచ్, వాతావరణం, మైదాన పరిస్థితులను బట్టి వ్యూహాలను మార్చుకోవాలి’ అని మోర్కెల్ వివరించాడు.


కొలతలకు తగ్గట్టుగా బౌలింగ్..

ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో ప్రత్యేకమైన బౌండరీ కొలతలు ఉంటాయి. ఇవి పర్యాటక జట్ల బౌలర్లకు కొన్నిసార్లు సవాలుగా మారుతుంటాయి. అయితే భారత బౌలర్లు అక్కడి పరిస్థితులకు చక్కగా అలవాటు పడ్డారని మోర్కెల్ ప్రశంసించాడు. ‘మైదానంలోని కొలతలను దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ చేయడం కంటే.. మన ప్రణాళికలపై దృష్టి పెట్టాలని బౌలర్లకు చెప్పాను. ఆటగాళ్లు తమ వ్యూహాలను అద్భుతంగా అమలు చేస్తు్న్నారు. న్యూజిలాండ్‌లో కొన్నిసార్లు ఫీల్డింగ్ సెటప్‌ను బట్టి ఎలాంటి బంతులు వేయాలో అర్థమవుతుంది. అయితే సరైన ప్రదేశాల్లో బంతిని సంధించడం కూడా అంతే ముఖ్యం’ అని మోర్కెల్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఆసీస్ ప్లేయర్లందరికీ తెలుసు.. శాండ్‌పేపర్ వివాదంపై ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు

షమీకి మరొక్క అవకాశమైనా ఇవ్వాల్సింది.. బీసీసీఐపై రవి శాస్త్రి అసంతృప్తి

Updated Date - Nov 07 , 2026 | 01:28 PM