రూ.14.20కోట్ల ప్లేయర్‌ను రిటైన్ చేసుకోవాలి.. సీఎస్కేకి ఇర్ఫాన్ పఠాన్ సూచన
ABN , Publish Date - Nov 07 , 2026 | 11:36 AM
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సీఎస్కే యాజమాన్యానికి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచన చేశాడు. గత వేలంలో ఏకంగా రూ.14.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన యువ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను మరో సీజన్ కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యాజమాన్యానికి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచన చేశాడు. గత వేలంలో ఏకంగా రూ.14.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన యువ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను మరో సీజన్ కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. గత సీజన్‌లో అవకాశాలు ఎక్కువ రాకపోయినప్పటికీ అతడిలో ఆల్‌రౌండ్ నైపుణ్యాలు ఉన్నాయని, మరో అవకాశం ఇవ్వాలని సూచించాడు. నవంబర్ 17తో ఐపీఎల్ 2027 రిటెన్షన్, ట్రేడింగ్ గడువు ముగియనుండగా.. డిసెంబర్ 16న మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పుపై దృష్టి సారించాయి.
‘ప్రశాంత్ వీర్‌ను అధిక ధర పెట్టి తీసుకున్నారు. గత సీజన్‌లో అతడికి ఆడే అవకాశాలు ఎక్కువగా రాలేదు. కానీ అతడిలో ఆల్‌రౌండ్ నైపుణ్యాలు ఉన్నాయి. ప్రశాంత్ వీర్‌కు మరో సీజన్‌లో అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు. కాబట్టి అతడిని సీఎస్కే రిటైన్ చేసుకోవాలి. కాగా గత వేలంలో రూ.5.20 కోట్లకు కొనుగోలు చేసిన లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను మాత్రం విడుదల చేయాలి. అతడి స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకోవాలి’ అని ఇర్ఫాన్ సీఎస్కేకు సూచించాడు.
కేకేఆర్‌కు కామెరూన్ గ్రీన్, పతిరణ చిక్కులు!
మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కూడా రిటెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గత వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం రూ.25.20 కోట్లు, శ్రీలంక పేసర్ మతీశా పతిరణ కోసం రూ.18 కోట్లు వెచ్చించింది. గ్రీన్ తీవ్రంగా విఫలమవ్వగా.. పతిరణ గాయం కారణంగా మ్యాచ్‌లే ఆడలేదు. ఆడిన ఒక్క మ్యాచ్‌లో కేవలం ఎనిమిది బంతులే బౌలింగ్ వేశాడు. దీంతో వీరిద్దరినీ కొనసాగించాలా? వద్దా? అన్నది కేకేఆర్‌కు ప్రశ్నగా మారింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల విషయంలోనూ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు. అరుదైన ఆల్‌రౌండ్ నైపుణ్యాలున్న కామెరూన్ గ్రీన్‌ను కేకేఆర్ కొనసాగించాలని సూచించాడు. అయితే ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పతిరణను మాత్రం విడుదల చేయాలని అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
ఆసీస్ ప్లేయర్లందరికీ తెలుసు.. శాండ్‌పేపర్ వివాదంపై ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు
షమీకి మరొక్క అవకాశమైనా ఇవ్వాల్సింది.. బీసీసీఐపై రవి శాస్త్రి అసంతృప్తి