Share News

డబ్ల్యూటీసీలో నంబర్ వన్ బౌలర్‌గా మిచెల్ స్టార్క్

ABN , Publish Date - Aug 23 , 2026 | 07:22 AM

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్‌లో తన జోరును కొనసాగిస్తూ కొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.

 డబ్ల్యూటీసీలో నంబర్ వన్ బౌలర్‌గా మిచెల్ స్టార్క్
Mitchell Starc

స్పోర్ట్స్ డెస్క్: మెకే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన బౌలింగ్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. కేవలం 12 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతడు వేసిన 10 ఓవర్లలో 6 ఓవర్లు మెయిడెన్ కావడం విశేషం. ఈ సూపర్ ప్రదర్శనతో మిచెల్ స్టార్క్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. మెకే టెస్టులో ఇప్పటి వరకు 8 వికెట్లు సాధించిన స్టార్క్.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.


ఈ ఆసీస్ స్టార్ పేసర్ డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 56 టెస్టు మ్యాచ్‌లు ఆడి 230 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా మ్యాచ్‌లో మరో ఆస్ట్రేలియా పేసర్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీసి.. 225 వికెట్లతో నాథన్ లయోన్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుత 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్‌లోనూ స్టార్క్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత సైకిల్‌లో స్టార్క్ 10 మ్యాచ్‌లాడి 17.51 సగటుతో 54 వికెట్లు సాధించాడు. ఇందులో నాలుగు ఐదు వికెట్ల హాల్స్ ఉండటం విశేషం. ఇంగ్లండ్ ఆటగాడు జోష్ టంగ్ 53 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.


డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:

  • మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)-230

  • ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)-225

  • నాథన్ లియోన్(ఆస్ట్రేలియా)-225

  • రవిచంద్రన్ అశ్విన్(భారత్)-195

  • జస్ప్రీత్ బుమ్రా(భారత్)-185


ఇవి కూడా చదవండి:

ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని దారుణ హత్య

టెస్ట్ క్రికెట్ అభివృద్ధి చెందాలంటే వైభవ్ లాంటి ప్లేయర్లు ఆడాలి: ద్రవిడ్

Updated Date - Aug 23 , 2026 | 07:35 AM