Hundred League: ఫ్రాంచైజీ పేరు మార్చుకున్న మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టు
ABN , Publish Date - Jan 16 , 2026 | 03:35 PM
ఇంగ్లాండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్‌లోని ఓ ఫ్రాంచైజీ తన జట్టు పేరును మార్చింది. మాంచెస్టర్ ఒరిజినల్స్ అనే జట్టు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా మారింది. దీంతో గురువారం మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ లోగోను ఆవిష్కరించారు. ఈ లోగోలో ఏనుగు ప్రతీక ఉండటం విశేషం.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లాండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్‌లోని ఓ ఫ్రాంచైజీ తన జట్టు పేరును మార్చింది. మాంచెస్టర్ ఒరిజినల్స్.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్(Manchester Super Giants)గా మారింది. వివిధ లీగ్స్‌లో ఇప్పటికే రెండు సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఈ మూడు సూపర్ జెయింట్స్‌కు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆధినేత సంజీవ్ గొయెంకా ఓనర్‌గా ఉన్నారు.
మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టుకు పేరుతో పాటు కొత్త లోగో కూడా వచ్చింది. గురువారం మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ లోగోను ఆవిష్కరించారు. లక్నో, డర్బన్ సూపర్ జెయింట్స్ లోగోలకు భిన్నంగా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ లోగోలో ఏనుగు ప్రతీక ఉండటం విశేషం. లోగో ఆవిష్కరణ సందర్భంగా సూపర్ జెయింట్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఇంగ్లాండ్ స్టార్ వికెట్ కీపర్ జోస్ బట్లర్(Jos Buttler retained) (పురుషుల హండ్రెడ్), అదే దేశానికి చెందిన మహిళా స్పిన్ బౌలర్ సోఫీ ఎక్ల్‌స్టోన్ (మహిళల హండ్రెడ్)ను రిటైన్ చేసుకుంటున్నట్లు వెల్లడించింది. బట్లర్ డర్బన్ సూపర్ జెయింట్స్‌లోనూ భాగంగా ఉన్నాడు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ బట్లర్, ఎక్లెస్టోన్‌తో పాటు మరికొంత మందిని కూడా రిటైన్ చేసుకుంది.
పురుషుల విభాగంలో హెన్రిచ్ క్లాసెన్, నూర్ అహ్మద్‌ను తిరిగి తీసుకుంది. కొత్తగా పురుషుల విభాగంలో లియామ్ డాసన్.. మహిళల విభాగంలో మెగ్ లాన్నింగ్, స్మృతి మంధానను జట్టులోకి తీసుకుంది. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ కంటే ముందు హండ్రెడ్(The Hundred) లీగ్‌లో రెండు ఫ్రాంచైజీల పేర్లు మారాయి. ముంబై ఇండియన్స్ యాజమాన్యంలో నడిచే ఓవల్ ఇన్విన్సిబుల్స్.. ఎంఐ లండన్‌గా, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో నడిచే నార్తర్న్ సూపర్ చార్జర్స్.. సన్‌రైజర్స్ లీడ్స్‌గా రూపాంతరం చెందాయి.
ది హండ్రెడ్:
'ది హండ్రెడ్' (The Hundred) లీగ్ 2026 పురుషులు, మహిళల విభాగాల్లో జులై 21 నుంచి ప్రారంభం కానుంది. అన్ని ఫ్రాంచైజీలకు జనవరి చివరి వరకు నాలుగు ప్రీ ఆక్షన్ సైనింగ్‌లకు ఛాన్స్ ఉంది. ప్రధాన ఆక్షన్ మార్చిలో జరగనుంది. 'ది హండ్రెడ్' లీగ్‌లో ఓవర్లకు బదులు బంతుల విధానం ఉన్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో బౌలర్లు 6 బంతులకు బదులు 5 లేదా 10 బంతులు వరుసగా వేయవచ్చు. ఫీల్డింగ్ ఎండ్ కూడా ప్రతి 10 బంతులకు మారుతుంది.
ఇవి కూడా చదవండి:
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సంచలనం.. మరో హ్యాట్రిక్ నమోదు