Share News

కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్‌కు రజతం

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:56 AM

కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఎనిమిది పతకాలతో విజయవంతంగా ముగించింది. పురుషుల 110+ కిలోల విభాగంలో భారత అథ్లెట్ లవ్‌ప్రీత్ సింగ్ రజత పతకం సాధించాడు.

కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్‌కు రజతం
Lovepreet Singh

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఎనిమిది పతకాలతో విజయవంతంగా ముగించింది. పురుషుల 110+ కిలోల విభాగంలో భారత అథ్లెట్ లవ్‌ప్రీత్ సింగ్ రజత పతకం సాధించాడు. గ్లాస్గో వేదికగా జరిగిన ఈ పోటీల్లో భారత్ ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక కాంస్యాన్ని కైవసం చేసుకుంది. లవ్‌ప్రీత్ స్నాచ్‌లో 176 కిలోలు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డును సమం చేశాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 212 కిలోలు లిఫ్ట్ చేసి మొత్తంగా 388 కిలోలు ఎత్తాడు. అయితే న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ ఆండ్రూ లిటి చివరి ప్రయత్నంలో 223 కిలోలు ఎత్తి మొత్తం 389 కిలోలతో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో లవ్‌ప్రీత్ ఒక్క కిలో తేడాతో రజతంతో సరిపెట్టుకున్నాడు. బర్మింగ్‌హామ్ 2022లో కాంస్యం సాధించిన అతడు ఈసారి రజతంతో తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్నాడు.


చాలా బాధగా అనిపిస్తోంది: లవ్‌ప్రీత్

ఒక్క కిలో తేడాతో స్వర్ణం చేజారడం బాధ కలిగించిందని లవ్‌ప్రీత్ సింగ్ వెల్లడించాడు. ‘స్వర్ణం చేజారడం సహజంగానే బాధ కలిగిస్తుంది. కానీ రానున్న ఆసియా క్రీడల్లో మరింత బలంగా తిరిగి వస్తాను. నా కోచ్ విజయ్ శర్మ, భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యకు చెందిన సహదేవ్ సింగ్, భారత ప్రభుత్వం, భారత నౌకాదళానికి చెందిన కెప్టెన్ విజయ్ కుమార్ అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పతకాన్ని వారందరికీ అంకితం చేస్తున్నా’ అని లవ్‌ప్రీత్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్: పట్టుదలే పతకమైంది.. డిస్కస్ త్రోలో సీమా కళిరామన్‌కు కాంస్యం

దులీప్ ట్రోఫీ.. వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్ ఎలా చేశారు?: హర్షా భోగ్లే

Updated Date - Jul 31 , 2026 | 11:57 AM