అజేయంగా ముగించాలని..
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:05 AM
మహిళల టీ20 ఆసియాకప్‌లో ఇప్పటికే సెమీఫైనల్ చేరిన భారత జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ చివరి మ్యాచ్‌ను శనివారం పాకిస్థాన్‌తో ఆడనుంది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా మెగా టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే.
ఫేవరెట్ భారత్.. పాకిస్థాన్‌తో పోరు నేడు
దుబాయ్: మహిళల టీ20 ఆసియాకప్‌లో ఇప్పటికే సెమీఫైనల్ చేరిన భారత జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమ చివరి మ్యాచ్‌ను శనివారం పాకిస్థాన్‌తో ఆడనుంది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా మెగా టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగడం ఇది రెండోసారి. ఇంగ్లండ్‌లో జరిగిన టీ20 వరల్డ్‌క్‌పలో పాక్‌పై భారత్ గెలిచింది. అలాగే ఆసియాకప్ టీ20 టోర్నీలోనూ ఆరుసార్లు తలపడగా పాక్ ఒక్కసారి మాత్రమే నెగ్గడం గమనార్హం. ఇక నేటి మ్యాచ్‌లోనూ హర్మన్‌ప్రీత్ సేన స్పష్టమైన ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. అటు పాక్ జట్టు తమ ఆరంభ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ రేసులోనే ఉంది. అయితే ఈ జట్టులోనూ బ్యాటింగ్ వైఫల్యం కనిపిస్తోంది. థాయ్‌లాండ్‌పై పవర్‌ప్లేలోనే 25/3 స్కోరుతో నిలిచి కష్టంగా 119 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేయగలిగింది. కెప్టెన్ ఫాతిమా సనా, వికెట్ కీపర్ బ్యాటర్ మునీబా అలీపై జట్టు ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఇక భారత్‌కు ఇది నామమాత్రపు మ్యాచే అయినా, విజయంతో గ్రూపును అజేయంగా ముగించాలనుకుంటోంది.
బ్యాటర్లు రాణిస్తారా?
తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు తీవ్రంగా నిరుత్సాహపర్చారు. ముఖ్యంగా జట్టులోని మిడిలార్డర్ క్రీజులో నిలవలేకపోతోంది. స్లో పిచ్‌పై మనోళ్ల బలహీనతను ప్రత్యర్థి బౌలర్లు సొమ్ము చేసుకున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో పాటు ప్రతికా రావల్, రిచా ఘోష్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ మాత్రమే అంచనాలను అందుకుంటున్నారు. తొలి మ్యాచ్‌లో షఫాలీ హాఫ్ సెంచరీ సాధించగా.. హాంకాంగ్‌పై మంధాన శతకం బాదిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, సెంచరీలను స్మృతి తన ఖాతాలో వేసుకుంది. పాక్‌పైనా మంధాన బ్యాట్ ఝుళిపిస్తే భారత్‌కు మరో భారీ విజయం ఖాయమైనట్టే. ఇక బౌలింగ్ విభాగంలో మాత్రం భారత్ అదరగొడుతోంది. పేసర్లు నందని శర్మ, క్రాంతి గౌడ్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బ్యాటర్లను బెదరగొడుతున్నారు. స్పిన్నర్లు దీప్తి శర్మ, తెలుగమ్మాయి శ్రీచరణి నిలకడగా వికెట్లు పడగొడుతుండడం సానుకూలాంశం కానుంది. దీంతో తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతికా రావల్, రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), భార్తి ఫుల్మాలి, దీప్తి శర్మ, ప్రేమా రావత్, నందని శర్మ, శ్రీచరణి, క్రాంతి గౌడ్.
పాకిస్థాన్: మునీబా అలీ, షవాల్ జుల్ఫికర్, గుల్ ఫిరోజ, ఆయేషా జఫర్, సదాఫ్ షమాస్, ఫాతిమా సనా (కెప్టెన్), ఉమ్ ఇ హని, ఎమాన్ ఫాతిమా, తుబా హస్సన్, నష్రా సంధు, సదియా ఇక్బాల్.
ఈ వార్తలను కూడా చదవండి
ఒకే గ్రామంలో ఇద్దరు గురువులకు అవార్డులు
వార్డుల పునర్విభజనకు పచ్చజెండా