Share News

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ వీర విధ్వంసం.. ఢిల్లీపై ఘన విజయం

ABN , Publish Date - Apr 25 , 2026 | 08:01 PM

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ విజయ ఢంకా మోగిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసింది. ఢిల్లీ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ బ్యాటర్లు 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించేశారు.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ వీర విధ్వంసం.. ఢిల్లీపై ఘన విజయం
PBKS vs Dc

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ విజయ ఢంకా మోగిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసింది. ఢిల్లీ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ బ్యాటర్లు 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించేశారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రికార్డు ఛేదన. అంతకుముందు కూడా ఈ రికార్డు పంజాబ్ పేరిటే ఉంది. 2024లో కోల్‌కతా నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఛేజ్ చేసింది. పంజాబ్ బ్యాటర్ల ధాటికి ఢిల్లీ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్(76), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(71*) హాఫ్ సెంచరీలతో విధ్వంసం సృష్టించిన వేళ.. ఢిల్లీకి మరో ఓటమి తప్పలేదు.


ప్రియాంశ్ ఆర్య(43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్(76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగి ఆడారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 41 బంతుల్లో 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కూపర్ కనోలి(17), నేహాల్ వధేరా(25) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఆఖరిలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(71*; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) బీభత్సం సృష్టించాడు. శశాంక్ సింగ్(19*; 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 26 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కెప్టెన్ శ్రేయస్ జట్టుకు మరో విజయాన్ని అందించాడు. దీంతో 13 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ తన అగ్రస్థానాన్ని పదిలపరుచుకుంది. ఢిల్లీ బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ 1, విప్రాజ్ నిగమ్ 1 వికెట్ పడగొట్టారు.


అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ భారీ శతకంతో బీభత్సం సృష్టించాడు. 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో ఏకంగా 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో బ్యాటర్లు నితీశ్ రాణా తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. రాహుల్, నితీశ్ రాణా కలిసి రెండో వికెట్‌కు 95 బంతుల్లో ఏకంగా 220 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్‌లో ఇదే రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మరోవైపు ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన భారత ప్లేయర్‌గా రాహుల్ రికార్డ్ సృష్టించాడు. పాతుమ్ నిశాంక(11) విఫలమయ్యాడు. బార్ట్‌లెట్(3*) నాటౌట్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్, బార్ట్‌లెట్ తలొక వికెట్ తీశారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ప్యాట్ కమిన్స్ రీఎంట్రీ.. ఆర్ఆర్‌పై టాస్ నెగ్గిన సన్‌రైజర్స్

ఐపీఎల్ 2026: ఢిల్లీ బౌలర్ ఎంగిడికి తీవ్ర గాయం.. మైదానంలోకి అంబులెన్స్

Updated Date - Apr 25 , 2026 | 08:02 PM