Indian Football Crisis: భారత ఫుట్‌బాల్‌ను కాపాడండి!.. ఫిఫాకు ఆటగాళ్ల విజ్ఞప్తి
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:17 AM
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడంతో దేశీయ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాళ్లు గొంతు విప్పారు. భారత ఫుట్‌బాల్ ఐకాన్ సునీల్ ఛేత్రి, గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధు, డిఫెండర్ సందేశ్ ఝింగన్ ఈ విషయంలో ఫిఫాను నేరుగా జోక్యం చేసుకోవాలని కోరారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత ఫుట్‌బాల్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడంతో దేశీయ దిగ్గజ ఆటగాళ్లు గొంతు విప్పారు. భారత ఫుట్‌బాల్ ఐకాన్ సునీల్ ఛేత్రి, గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధు, డిఫెండర్ సందేశ్ ఝింగన్ ఈ విషయంలో ఫిఫాను నేరుగా జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ విజ్ఞప్తిలో భారతీయులతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా భాగస్వాములయ్యారు.
ఏఐఎఫ్‌ఎఫ్ (అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య)–ఈవెంట్ నిర్వాహకుల మధ్య మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ (ఎంఆర్‌ఏ) పునరుద్ధరణ జరగకపోవడంతో 2025 జూలైలో ఐఎస్ఎల్ నిలిచిపోయింది. అప్పటి నుంచి వాణిజ్య భాగస్వామి లేక ఏఐఎఫ్‌ఎఫ్ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఈ ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో ఆటగాళ్లు మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు.
మేం మైదానంలో ఉండాలి..
సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియోలో పలువురు ఫుట్‌బాల్ దిగ్గజాలు మాట్లాడారు. ‘ఇప్పటికే జనవరి వచ్చింది. ఈ సమయానికి మేం ఐఎస్ఎల్ మ్యాచ్‌లతో మీ స్క్రీన్లపై ఉండాలి. కానీ అలా లేదు’ అని గురుప్రీత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మేం అందరికీ తెలిసిన నిజాన్నే భయం, నిరాశతో బయటపెట్టాల్సి వస్తోంది’ అని ఝింగన్ అన్నాడు. ‘ఆటగాళ్లు, సిబ్బంది, యజమానులు, అభిమానులు.. అందరికీ ఈ విషయంపై ఓ స్పష్టత రావాలి. ముఖ్యంగా ఫుట్‌బాల్‌కు ఓ భవిష్యత్తు కావాలి’ అని సునీల్ ఛేత్రి(Sunil Chhetri) స్పష్టం చేశాడు.
ఫిఫాకు నేరుగా విజ్ఞప్తి
‘భారత ఫుట్‌బాల్ పాలన వ్యవస్థ తన బాధ్యతలను నెరవేర్చలేని స్థితికి చేరింది. మేం శాశ్వత స్థబ్దత అంచున ఉన్నాం. ఇది చివరి ప్రయత్నం. భారత ఫుట్‌బాల్‌ను కాపాడేందుకు ఫిఫా(FIFA) జోక్యం చేసుకోవాలి. ఇది రాజకీయ పిలుపు కాదు. అవసరం వల్ల వచ్చిన విజ్ఞప్తి. ప్రస్తుతం మేం మానవతా, క్రీడా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. మాకు సహాయం కావాలి. మేం కేవలం ఫుట్‌బాల్ ఆడాలనుకుంటున్నాం’ అని ఆ వీడియోలో ఆటగాళ్లు పేర్కొన్నారు.
మొత్తానికి, భారత ఫుట్‌బాల్ భవితవ్యంపై మబ్బులు కమ్ముకున్న వేళ, ఆటగాళ్ల ఆవేదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫిఫా జోక్యం చేసుకుంటుందా? ఐఎస్ఎల్ తిరిగి ప్రారంభమవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
ఆఖరి నిమిషంలో తుది జట్టుకు గిల్ దూరం.. కారణం అదేనా?
ఓ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైతే జట్టులోంచే తీసేస్తారా?: యోగ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు