ఆర్చరీ ప్రపంచ కప్: భారత్‌కు స్వర్ణం
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:47 PM
ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 పోటీలో భారత్ స్వర్ణం గెలుచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 పోటీలో భారత్ స్వర్ణం గెలుచుకుంది. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్‌కు చెందిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్.. ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాను వరుస సెట్లలో ఓడించారు. దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యే-జిన్, కిమ్ జె-డివోక్‌పై 5-1 తేడాతో విజయం సాధించారు. నాలుగేళ్ల తర్వాత భారత్ వరల్డ్ కప్ స్టేజ్‌లో ఈ విభాగంలో బంగారు పతకం సాధించింది. చివరిసారిగా 2022 ఈవెంట్‌లో రిధి ఫోర్ - తరుణ్‌దీప్ రాయ్ జోడీ గోల్డ్‌ను గెలుచుకుంది.
తొలి సెట్ నుంచే ఆధిక్యం సాధించిన భారత జోడీ.. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమిస్తూ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా చివరి దశలో ధీరజ్ వరుసగా రెండు పర్ఫెక్ట్ 10లు కొట్టడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అతడి గురి దక్షిణ కొరియాకు అవకాశమే ఇవ్వకుండా భారత్‌కు స్వర్ణ పతకాన్ని ఖాయం చేసింది. తొలి రెండు రౌండ్లలో 37-36, 37-36తో భారత్‌దే ఆధిపత్యం. ఇక మూడో రౌండ్‌లోనూ పోటాపోటీగా జరిగినా.. 39-39తో ఇరు జట్లూ సమంగా నిలిచాయి. దీంతో భారత్ విజేతగా అవతరించింది. ధీరజ్, కుంకుమ్‌లకు మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఇది తొలి ప్రపంచకప్ స్వర్ణ పతకం కావడం విశేషం. ప్రస్తుతం భారత అగ్రశ్రేణి ఆర్చర్‌గా కొనసాగుతున్న ధీరజ్ వ్యక్తిగత విభాగంలోనూ పతక పోటీలో నిలిచాడు. మరోవైపు 17 ఏళ్ల కుంకుమ్ మొహోద్ అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఈ ఏడాది షాంఘై ప్రపంచకప్ స్టేజ్-2లో భారత మహిళల రికర్వ్ జట్టుతో కలిసి ఆమె ఇప్పటికే స్వర్ణ పతకం గెలిచింది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు
పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే