వాంఖడేలో ప్లేయర్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైరల్
ABN , Publish Date - Jun 14 , 2026 | 02:29 PM
టీ20 ముంబై లీగ్ 2026 ఫైనల్ పోరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా ఆర్క్స్ అంధేరి, మరాఠా రాయల్స్ జట్ల మధ్య జరిగిన టైటిల్ పోరు అనంతరం ఇరుజట్ల ప్లేయర్లు గొడవకు దిగారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ముంబై లీగ్ 2026 ఫైనల్ పోరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా ఆర్క్స్ అంధేరి, మరాఠా రాయల్స్ జట్ల మధ్య జరిగిన టైటిల్ పోరు అనంతరం ఇరుజట్ల ప్లేయర్లు గొడవకు దిగారు. ఒకానొక దశలో ఇద్దరు క్రికెటర్లు దాడి చేసుకునే వరకు వెళ్లారు. దీంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరాఠా రాయల్స్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో ఆర్క్స్ అంధేరి ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ వివాదం మొదలైంది. ఆ ఓవర్ రెండో బంతికి అంధేరి బ్యాటర్ గౌరవ్ జతార్ సిక్స్ కొట్టాడు. అయితే ఆ తర్వాతి బంతికే ఇర్ఫాన్ ఉమైర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో రాయల్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, గౌరవ్ అసహనం వ్యక్తం చేశాడు. గౌరవ్ పెవిలియన్ వైపు వెళ్తుండగా.. డగౌట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మరాఠా రాయల్స్ ఆటగాడు రోహన్ రాజేతో అతనికి మాటల యుద్ధం నడిచింది. మొదట ఫోర్త్ అంపైర్ ఇద్దరినీ విడదీసినప్పటికీ.. వారు మళ్లీ ఒకరినొకరు నెట్టుకుంటూ తీవ్రమైన వాగ్వాదానికి దిగారు. దీంతో అంధేరి జట్టు సభ్యులతో పాటు మరాఠా రాయల్స్ ఆటగాళ్లు కూడా స్టేడియంలోకి పెరిగెత్తుకుంటూ వచ్చి రోహన్, గౌరవ్‌లకు సర్ది చెప్పారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ హైడ్రామా నడుమ సాగిన ఫైనల్ పోరులో సిద్దేష్ లాడ్ నేతృత్వంలోని మరాఠా రాయల్స్ జట్టు ఘన విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మరాఠా రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. జట్టులో చిన్మయ్ రాజేష్ సుతార్ 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అంధేరి జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు
పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే