టోర్నీకే కిక్.. వీళ్ల ఫైట్!
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:52 PM
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సమరం.. కేవలం ఆట కాదు.. అంతకు మించిన భావోద్వేగం. టోర్నమెంట్ ఏదైనా ఆ రెండు జట్లపైనే కళ్లన్నీ.. వాటి మధ్య పోరు గురించే చర్చంతా. ఓ మ్యాచ్ జరుగుతుంటే ఇరుదేశాల అభిమానులే ఆసక్తిగా చూస్తారు.
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సమరం.. కేవలం ఆట కాదు.. అంతకు మించిన భావోద్వేగం. టోర్నమెంట్ ఏదైనా ఆ రెండు జట్లపైనే కళ్లన్నీ.. వాటి మధ్య పోరు గురించే చర్చంతా. ఓ మ్యాచ్ జరుగుతుంటే ఇరుదేశాల అభిమానులే ఆసక్తిగా చూస్తారు. కానీ, ఈ రెండు జట్లు ఆడుతుంటే క్రికెట్ ప్రపంచమే ఊగిపోతుంది. టీవీ తెరలకు కళ్లప్పగించే అసలు సిసలు సమరం ఈ ప్రపంచక్‌పలోనూ సిద్ధంగా ఉంది. టోర్నీలో జోష్‌ను పెంచేలా, ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇచ్చేలా.. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు బ్యాట్, బంతితో ఈసారీ ముఖాముఖి ఫైట్ చేస్తున్నారు. ఒకే గ్రూప్‌లో ఉన్న ఇరుజట్లు గ్రూప్ దశలో భాగంగా ఈనెల 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో.. ప్రధానంగా విశ్వక్‌పలో పాక్‌పై టీమిండియాదే ఆధిపత్యం. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటిదాకా ఎనిమిది మ్యాచ్‌లు జరగగా.. ఏడింటిలో మనోళ్లదే పైచేయి. 2007 ప్రపంచ కప్‌లో పాక్‌పై మొదలైన టీమిండియా విజయ ప్రస్థానం 2016 టోర్నీ దాకా అజేయంగా కొనసాగింది. ఒకే ఒక్క పరాజయం 2021 కప్పులో ఎదురైనా.. ఆ తర్వాత రెండు టోర్నీల్లోనూ విజయం భారత్‌నే వరించింది. మరి.. మెగా టోర్నీలో దాయాదుల ముఖాముఖి ప్రస్థానాన్ని ఓసారి గుర్తు చేసుకుందామా!
2007: తొలి గెలుపు..
దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ తొలి టీ20 ప్రపంచక్‌పను ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా పాకిస్థాన్‌తోనే ప్రారంభించింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం స్కాట్లాండ్‌తో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆడాల్సి ఉన్నా, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. దీంతో భారత్ తన రెండో మ్యాచ్‌ను పాక్‌తో తలపడింది. అలా.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తన ఆరంభ పోరును పాక్‌తోనే ఆడి..మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప (50) అర్ధ సెంచరీకి తోడు కెప్టెన్ ధోనీ (33), లోయరార్డర్‌లో ఇర్ఫాన్ పఠాన్ (20) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఛేదనలో పాక్.. మిస్బావుల్ హక్ (53), షోయబ్ మాలిక్ (20) రాణించడంతో ఏడు వికెట్ల నష్టానికి సరిగ్గా 141 పరుగులే చేయగలిగింది. దీంతో విజేతను తేల్చేందుకు బౌలౌట్ పద్ధతికెళ్లారు. బౌలౌట్‌లో భారత ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఊతప్ప వికెట్లను గురి చూసి కూల్చగా.. పాక్ బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా బౌలౌట్‌లో 3-0తో పాక్‌ను చిత్తుచేసి టీ20 కప్ చరిత్రలో తమ ప్రస్థానాన్ని ఘనంగా మొదలుపెట్టారు.
ఫైనల్లో పడగొట్టి.. విజేతగా నిలిచి..
2007 టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ తొలి మ్యాచ్‌లో పోటీపడ్డ భారత్, పాక్ జట్లు ఫైనల్లోనూ తలపడ్డాయి. జొహాన్నె్‌సబర్గ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట భారత్.. గంభీర్ (75) సూపర్ ఇన్నింగ్స్‌కు తోడు రోహిత్ శర్మ (30) రాణించడంతో ఐదు వికెట్లకు 157 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్పీ సింగ్ (3/26), ఇర్ఫాన్ పఠాన్ (3/16), జోగిందర్ శర్మ (2/20) సత్తాచాటడంతో పాక్ 152 పరుగులకే ఆలౌటైంది. పాక్‌కు ఇమ్రాన్ నజీర్ (14 బంతుల్లో 33) మెరుపు ఆరంభాన్నిచ్చినా, అతని రనౌట్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. పాక్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమవగా.. భారత్ గెలుపునకు వికెట్ దూరంలో ఉంది. ఈ పరిస్థితుల్లో జోగిందర్ శర్మ వేసిన బౌలింగ్‌లో మిస్బా సిక్సర్ బాదాడు. ఉత్కంఠ ఊపేస్తున్న ఆ తరుణంలో జోగిందర్ వేసిన మరో బంతిని మిస్బా షార్ట్ ఫైన్ లెగ్‌లో కొట్టగా, అంతే వేగంగా దాన్ని శ్రీశాంత్ అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు. దీంతో.. తొలి టీ20 ప్రపంచకప్ భారత్ ఖాతాలో చేరింది. అలా.. తొలి ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌లో, ఆపై ఫైనల్లో పాక్‌ను పడగొట్టి భారత్ తొలి కప్పును సాధించింది.
2012: అలవోకగా అదరగొట్టగా..
శ్రీలంక ఆతిథ్యమిచ్చిన 2012 ప్రపంచక్‌పలో గ్రూప్ దశలో భారత్, పాక్ తలపడ్డాయి. కొలంబో స్టేడియంలో జరిగిన ఈ పోరులో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో అలవోకగా విజయాన్నందుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్.. లక్ష్మీపతి బాలాజీ (3/22)కి తోడు అశ్విన్, యువరాజ్ అద్భుత బౌలింగ్ ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్.. కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 78) చెలరేగడంతో భారత్ మరో 18 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది.
2014: పోరాటమే లేకుండా..
ఢాకాలో జరిగిన 2014 టోర్నమెంట్ గ్రూప్ దశలో భారత్, పాక్ ఢీకొన్నాయి. ఏకపక్షంగా ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్‌కు పాక్ నుంచి పోరాటమే లేకపోయింది. అమిత్ మిశ్రా (2/22) స్పిన్ బౌలింగ్ ధాటికి పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 130/7 స్కోరుకే పరిమితమైంది. స్వల్ప ఛేదనలో.. ధవన్ (30), రోహిత్ (24), కోహ్లీ (36 నాటౌట్), రైనా (35 నాటౌట్) అండతో భారత్ అతి సులువుగా గెలుపొందింది.
2016: ఈడెన్‌లో ఈల వేయించి...
భారత్‌లో జరిగిన 2016 ప్రపంచక్‌పలోనూ ఇరుజట్లు గ్రూప్ దశలోనే పోటీపడ్డాయి. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యమిచ్చిన ఈ పోరులో భారత్ అదరగొట్టింది. ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండడంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్.. మన బౌలర్ల సమష్ఠి రాణింపుతో 118/5 స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసింది. విరాట్ కోహ్లీ అర్ధ శతకంతో విజృంభించి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇది టీ20 పోరులో పాక్‌పై భారత్‌కు వరుసగా ఐదో గెలుపు కావడం విశేషం.
2021: పాక్ గెలుపు రుచి..
టీ20 ప్రపంచకప్ 2018 టోర్నీ కరోనా కారణంగా వాయిదాపడింది. దీంతో ఐదేళ్ల తర్వాత 2021లో దుబాయ్‌లో నిర్వహించారు. ఇక, ప్రపంచక్‌పలో అప్పటిదాకా భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్.. ఈసారి మాత్రం గెలుపు రుచి చూసింది. గ్రూప్ దశలో తలపడ్డ పాక్ 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయాన్ని అందుకుంది. మొదట భారత్.. కోహ్లీ (50), పంత్ (39) రాణించడంతో 151/7 స్కోరు చేసింది. తర్వాత పాక్ ఓపెనింగ్ జోడీ బాబర్ ఆజమ్ (68 నాటౌట్), రిజ్వాన్ (79 నాటౌట్) చివరికంటా క్రీజులో నిలిచి 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకున్నారు. ఇలా.. మెగా టోర్నీలో భారత్‌పై తొలి విజయాన్ని పాక్ దక్కించుకుంది.
2022: దీపావళి పటాకా.. భారత్ ధమాకా
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన 2022 టీ20 కప్పు గ్రూప్ దశ పోరులో పాకిస్థాన్‌ను 4 వికెట్లతో భారత్ చిత్తుచేసింది. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో ఛేజింగ్ హీరో విరాట్ కోహ్లీ (82 నాటౌట్) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో చెలరేగి.. భారతీయులు ఒకరోజు ముందుగానే దీపావళి జరుపుకొనేలా చేశాడు. దీపావళి ముందురోజు జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట పాక్.. షాన్ మసూద్ (52 నాటౌట్), ఇఫ్తికార్ అహ్మద్ (51) రాణించడంతో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఛేదనలో విరాట్‌కు తోడు హార్దిక్ పాండ్యా (40) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు 160 కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
2024: కొట్టింది కొంచమైనా..
అమెరికాలో జరిగిన 2024 ప్రపంచకప్ పోరులోనూ పాక్‌పై భారత్‌దే పైచేయి. అయితే, ఈ విజయం భారత్‌కు అంత తేలికగా రాలేదు. భారత్ చేసింది అతి తక్కువ స్కోరే అయినా, ప్రతికూల పరిస్థితుల్లో స్టార్ పేసర్ బుమ్రా (3/14) విజృంభణతో లక్ష్యాన్ని కాపాడుకొంది. ఆరు పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. మొదట భారత్ 19 ఓవర్లలో 119 రన్స్‌కే కుప్పకూలింది. పంత్ (42) టాప్ స్కోరర్. అనంతరం బుమ్రాకు తోడు హార్దిక్ (2/24) రాణించడంతో పాక్ 20 ఓవర్లలో 113/7 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది.
- శ్రీభానుకాంత్ రెడ్డి
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. నిలకడగా ధరలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ధి సభకు హాజరైన సల్మాన్ ఖాన్
Read Latest Telangana News and National News