Share News

భారత హాకీ జట్టు చరిత్ర.. ఆరోసారి ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం!

ABN , Publish Date - Nov 05 , 2026 | 09:50 PM

హాకీ మైదానంలో భారత ఆటగాళ్ల జోరు మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆరంభంలో భారత్ వెనుకబడినా..

భారత హాకీ జట్టు చరిత్ర.. ఆరోసారి ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం!

ఇంటర్నెట్ డెస్క్: హాకీ మైదానంలో భారత ఆటగాళ్ల జోరు మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆరంభంలో భారత్ వెనుకబడినా.. పట్టుదలతో పోరాడి ప్రత్యర్థిని చిత్తు చేసింది. జపాన్‌తో జరిగిన తుది పోరులో 4-1తో విజయం సాధించి ఆరోసారి ఆసియా ఛాంపియన్స్‌గా మారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఈ టోర్నీలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర స‌ృష్టించింది.


వెనుకబడినా.. వెనకడుగు వేయలేదు!

మొహాలీలోని ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియర్ అంతర్జాతీయ హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్‌కు జపాన్ గట్టి పోటీ ఇచ్చింది. తొలి గోల్ సాధించి భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. అయితే ఆ తర్వాత భారత ఆటగాళ్లు సమష్టిగా పోరాడుతూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని తుడిచిపెట్టారు. షిలానంద్ లక్ష్రా నేతృత్వంలో జట్టు పుంజుకోగా.. చివరి క్వార్టర్‌లో భారత ఆటగాళ్లు దూకుడు పెంచారు. వరుస గోల్స్‌తో జపాన్‌ను వెనక్కి నెట్టి 4-1తో విజయం సాధించారు.


ఆసియా హాకీలో భారత్‌దే ఆధిపత్యం

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో భారత జట్టు విజయాల పరంపర ప్రత్యేకమైనది. 2011లో తొలిసారి టైటిల్ సాధించిన భారత్.. 2016లో రెండోసారి విజేతగా నిలిచింది. 2018లో పాకిస్థాన్‌తో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. 2023లో మలేషియాపై విజయం సాధించి నాలుగో టైటిల్‌ను అందుకుంది. 2024లో చైనాను ఓడించి ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పుడు జపాన్‌పై గెలుపుతో ఆరో టైటిల్‌ను సాధించి తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.

అజేయంగా సాగిన ప్రస్థానం

ఈ టోర్నీలో భారత జట్టు ఆరంభం నుంచే అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాపై 8-1తో భారీ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ జపాన్‌ను ఓడించి మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. వరుస విజయాలతో సాగిన భారత ప్రస్థానం.. ఆరో టైటిల్‌తో ఘనంగా ముగిసింది.


ఈ వార్తలూ చదవండి

‘పేస్‌’తో కొట్టారు

పారా అథ్లెట్ల పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి: ప్రధాని మోదీ

Updated Date - Nov 05 , 2026 | 09:55 PM