పారా అథ్లెట్ల పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి: ప్రధాని మోదీ
ABN , Publish Date - Nov 05 , 2026 | 09:42 PM
ఆసియా పారా గేమ్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత పారా అథ్లెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. క్రీడాకారుల పోరాటం, పట్టుదల, విజయాలు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిస్తున్నాయని కొనియాడారు.
న్యూఢిల్లీ, నవంబర్ 5: ఆసియా పారా గేమ్స్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత పారా అథ్లెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. క్రీడాకారుల పోరాటం, పట్టుదల, విజయాలు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిస్తున్నాయని కొనియాడారు. ఇవాళ (గురువారం) న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆసియా పారా గేమ్స్ పతక విజేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గతంలో పిల్లలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి తల్లిదండ్రులు సంకోచించేవారని అన్నారు. క్రీడా ప్రతిభను ప్రోత్సహించని వ్యవస్థను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువతలోని ప్రతిభ వృథా కాకూడనే లక్ష్యంతో క్రీడారంగంలో మౌలిక సదుపాయాలు, శిక్షణ, అవకాశాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, జూడో, పవర్‌లిఫ్టింగ్ వంటి విభాగాల్లో భారత్ కొత్త ఛాంపియన్లను తయారు చేస్తోందని ప్రశంసించారు.
ఆసియా పారా గేమ్స్‌లో 61 మంది క్రీడాకారులు తొలిసారిగా పాల్గొనడం విశేషమన్నారు మోదీ. రెండు స్వర్ణ పతకాలు సాధించిన ఆర్చర్ శీతల్ దేవి, దృష్టిలోపం ఉన్నప్పటికీ అద్భుత ప్రతిభ కనబరిచిన అథ్లెట్ సిమ్రన్‌ను మోదీ ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులు ప్రస్తుత విజయంతో సంతృప్తి చెందకుండా మరిన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన సూచించారు. 2028 లాస్ ఏంజెలెస్ పారాలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.
కాగా, జపాన్‌లోని ఐచి-నగోయాలో ఇటీవల ముగిసిన 2026 ఆసియా పారా గేమ్స్‌లో భారత్ చరిత్రాత్మక ప్రదర్శన చేసింది. మొత్తం 114 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలు ఉన్నాయి. 97 మంది భారత పారా అథ్లెట్లు ఈ విజయాల్లో భాగస్వాములయ్యారు. మరోవైపు, గతంలో సాధించిన 108 పతకాల రికార్డును భారత్ అధిగమించడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి
లాస్ ఏంజెలెస్ సిటీ అటార్నీగా భారత సంతతి మహిళ..
పొత్తు లేకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము: చిరాగ్ పాశ్వాన్