లాస్ ఏంజెల్స్ సిటీ అటార్నీగా భారత సంతతి మహిళ..
ABN , Publish Date - Nov 05 , 2026 | 08:18 PM
అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళ మారిస్సా రాయ్ కీలక పదవి చేపట్టనున్నారు. లాస్ ఏంజెల్స్ నగర తదుపరి సిటీ అటార్నీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
లాస్ ఏంజెల్స్: అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళ మారిస్సా రాయ్ కీలక పదవి చేపట్టనున్నారు. లాస్ ఏంజెల్స్ నగర తదుపరి సిటీ అటార్నీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికాలో నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో మారిస్సా తన ప్రత్యర్థి జాన్ మెకిన్నీపై స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. లాస్ ఏంజెల్స్ కౌంటీ ఎన్నికల అధికారుల ప్రకారం.. ఆమెకు 4,88,064 ఓట్లు (66.53 శాతం) రాగా.. మెకిన్నీకి 2,45,511 ఓట్లు (33.47 శాతం) వచ్చాయి. దీంతో ప్రత్యర్థిపై మారిస్సా ఘన విజయం సాధించారు.
మరోవైపు, ఎన్నికల ప్రచారంలో మారిస్సా ప్రత్యేకతను చాటుకున్నారు. తన సోషల్ మీడియా వీడియోల్లో బాలీవుడ్ పాటలను ఉపయోగించారు. అలాగే, ఆమె దుస్తులూ ప్రచారానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి. గెలుపు అనంతరం మారియా మాట్లాడుతూ.. సిటీ అటార్నీ కార్యాలయాన్ని నగరంలోనే అతిపెద్ద ప్రజా ప్రయోజనాల న్యాయ సంస్థగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ప్రజలను దోపిడీ చేస్తున్న భూస్వాములు, కార్పొరేట్ సంస్థలతో పాటు పలువురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. మారిస్సా రాయ్ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి అమెరికన్. కాలిఫోర్నియాలోని మోన్‌రోవియాలో ఆమె పెరిగారు. ఫ్లింట్రిడ్జ్ ప్రిపరేటరీ స్కూల్‌లో చదువు పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో స్కాలర్‌షిప్‌తో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ప్రతిష్ఠాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2017లో లాస్ ఏంజెలెస్ సిటీ అటార్నీ కార్యాలయంలోనే న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం, ఉద్యోగుల దోపిడీ వంటి అంశాలకు సంబంధించిన కేసుల్లో పనిచేశారు. ఆ తర్వాత లాస్ ఏంజెలెస్ కౌంటీకి న్యాయ సలహాదారుగా వ్యవహరించారు.
అనంతరం కాలిఫోర్నియా న్యాయశాఖలో చేరి డిప్యూటీ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెటా సంస్థకు సంబంధించిన కాలిఫోర్నియా ప్రభుత్వం చేపట్టిన న్యాయపోరాటంలోనూ మారిస్సా కీలక పాత్ర పోషించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పిల్లలపై చూపే హానికర ప్రభావాలను ఆ సంస్థ దాచిపెట్టిందనే కేసులో ఆమె కీలకంగా వ్యవహరించారు. ఈ వ్యాజ్యం ఆగస్టులో 17 బిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్‌కు దారితీసింది.
ఈ వార్తలు కూడా చదవండి
యూరప్‌లో విమానాలకు బాంబు బెదిరింపులు.. దారి మళ్లించిన అధికారులు..
రాహుల్ మద్యం వ్యాఖ్యలు.. ‘పప్పు’ అంటూ ఆప్ కౌంటర్