వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్.. ఎలా చూసుకోవాలంటే..?
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:28 PM
ఇక పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం అధికారిక పోర్టల్‌తో కుస్తీ పడాల్సిన అవసరం లేకుండా కేంద్ర కార్మిక శాఖ ‘వాట్సాప్ సేవ’ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే వాట్సాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసా..?
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకునే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవడం ఇప్పుడు మరింత సులభంగా మారింది. గతంలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ కావాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారానే ఈ వివరాలను పొందే సౌకర్యాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్, ఇటీవల జరిగిన లావాదేవీలు, పాస్‌బుక్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
ఒక్క ‘హాయ్’తో పీఎఫ్ వివరాలు
ఈపీఎఫ్‌వో కొత్తగా ప్రారంభించిన ‘వాట్సాప్ సేవ’ ద్వారా ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవడంతో పాటు చివరి ఐదు లావాదేవీల వివరాలనూ పొందవచ్చు. అంతేకాకుండా డిజిటల్ పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయమూ ఉంది. ఈ సేవను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నవంబర్ 1న ఈపీఎఫ్‌వో 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు.
ఈ సదుపాయాన్ని పొందాలంటే ముందుగా +91 8796441800 అనే అధికారిక ఈపీఎఫ్‌వో వాట్సాప్ నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌లో ఆ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపాలి. చాట్‌బాట్ స్పందించిన తర్వాత భాషను ఎంచుకుని, పీఎఫ్ బ్యాలెన్స్, లావాదేవీలు లేదా పాస్‌బుక్ డౌన్‌లోడ్ వంటి అవసరమైన సేవను ఎంపిక చేసుకోవాలి. తర్వాత రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం మీ మొబైల్ నంబర్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో అనుసంధానమై ఉండాలి. ధ్రువీకరణ పూర్తయ్యాక ఖాతాకు సంబంధించిన వివరాలను పొందవచ్చు.
భద్రత విషయంలో జాగ్రత్త!
ఈ సదుపాయాన్ని ఉపయోగించేటప్పుడు అధికారిక ఈపీఎఫ్‌వో వాట్సాప్ నంబర్‌నే సంప్రదించాలి. గుర్తుతెలియని నంబర్లకు యూఏఎన్, పాస్‌వర్డ్, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను వెల్లడించకూడదు. కాగా ఈ ‘వాట్సాప్ సేవ’ తరచూ తమ పీఎఫ్ వివరాలను తెలుసుకోవాలనుకునేవారికి సమయాన్ని ఆదా చేస్తుంది.
ఇవీ చదవండి
తక్కువ మాట్లాడడం వల్ల ఇన్ని లాభాలా..?
భానుడి నునులేత కిరణాల వల్ల ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..