Share News

పొత్తు లేకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము: చిరాగ్ పాశ్వాన్‌

ABN , Publish Date - Nov 05 , 2026 | 09:17 PM

వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్‌ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.

పొత్తు లేకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము: చిరాగ్ పాశ్వాన్‌
Chirag Paswan

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్‌ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్డీయేతో పొత్తు కుదరని పక్షంలో తాము అన్ని స్థానాల్లో (403) పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. 2023 నాటి ఎన్నికల్లో నాగాలాండ్‌లో ఒంటరిగా పోటీ చేసి రెండు సీట్లు గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

‘పొత్తు దిశగా ఇంకా చర్చలు మొదలు కాలేదు. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరాలనే అనుకుంటున్నాము. కేంద్రంలో అధికార పార్టీతో మాకు పొత్తు ఉంది. ఇది స్పష్టమే. బిహార్‌లో కూడా ఎన్డీయేతో పొత్తు కొనసాగుతోంది. కానీ నాగాలాండ్‌లో మేము ఒంటరిగా పోటీ చేశారు. మాకు అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి, యూపీలో పొత్తు కుదరకపోతే మొత్తం 403 సీట్ల నుంచి పోటీ చేసే ఛాన్సుంది’ అని చెప్పారు.


ఎల్‌జేపీ (ఆర్‌వీ)కి బిహార్‌లో మంచి పట్టు ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని దళిత వర్గం పాశ్వాన్‌‌లు పార్టీకి అండగా ఉన్నారు. 2025 ఎన్నికలో ఎల్‌జేపీ (ఆర్‌వీ) 66 శాతం స్ట్రైక్ రేటుతో 12 స్థానాల్లో విజయం సాధించింది. 2024 నాటి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ చేసిన 5 స్థానాల్లోనూ విజయం దక్కించుకుంది. యూపీలో కూడా దళితులైన పాసీ వారి మద్దతు కోసం ఎల్‌జేపీ ప్రయత్నిస్తోంది. దళితుల్లో మరో వర్గమైన జాతవ్‌లు మాత్రం మాయవతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతుగా ఉన్నారు.

యూపీలో ఎల్‌జేపీ ట్రాక్ రికార్డు అంతంతమాత్రమేనని పరిశీలకులు చెబుతున్నారు. చిరాగ్ తండ్రి సారథ్యంలో 2002లో అప్పటి అవిభాజిత ఎల్‌జేపీ కేవలం ఒక్క నియోజకవర్గంలోనే గెలిచింది. 2007, 2012 ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా విజయం సాధించలేకపోయింది. 2022 ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కొనసాగింది.


ఈ వార్తలనూ చదవండి:

దీపావళి వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..

అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే డెడ్‌లైన్ మొదలు.. సుప్రీం కోర్టు స్పష్టత

Updated Date - Nov 05 , 2026 | 09:24 PM