Share News

ఐసీసీ నిర్ణయంపై స్పందించిన బీసీబీ

ABN , Publish Date - Jan 22 , 2026 | 03:35 PM

టీ20 ప్రపంచ కప్-2026లో తమ మ్యాచులను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. ఐసీసీని కోరిన విషయం విదితమే. అయితే.. బుధవారం జరిగిన అత్యవసర సమావేశంలో బీసీబీ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. ఐసీసీ నిర్ణయంపై తాజాగా బీసీబీ అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం స్పందించారు.

ఐసీసీ నిర్ణయంపై స్పందించిన బీసీబీ
Bangladesh

స్పోర్ట్స్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో జరగబోయే టీ20 ప్రపంచ కప్-2026లో తమ మ్యాచులను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB).. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)ని కోరిన విషయం విదితమే. అయితే.. బుధవారం జరిగిన అత్యవసర సమావేశంలో బీసీబీ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. ఐసీసీ నిర్ణయంపై తాజాగా బీసీబీ అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం స్పందించారు.


ఓ స్పోర్ట్స్ మీడియా కథనం ప్రకారం.. ఏదో ఒక అద్భుతం జరిగి ఐసీసీ తమ పట్ల సానుకూలంగా స్పందిస్తుందని అమినుల్(Aminul Islam) ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లా ప్రభుత్వంతో చర్చించేందుకు తనకు కొంత గడువు కావాలని ఐసీసీ బోర్డును ఇస్లాం కోరారు. తమకు చివరి అవకాశం ఇవ్వాలని.. 24 నుంచి 48 గంటలలోపు తమ నిర్ణయం చెబుతామని ఆయన తెలిపారు. అయితే.. ఐసీసీ తీసుకున్న నిర్ణయం విషయంలో తాను బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టదలచుకోలేదన్నారు. ఏదేమైనా భారత్.. బంగ్లాదేశ్‌ మ్యాచులకు సురక్షితమైన ప్రదేశం కాదని, శ్రీలంకలో ఆడేందుకే తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఐసీసీ తమ అభ్యర్థనను తిరస్కరించిందని తెలుసని, ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తున్నామని వెల్లడించారు.


ప్రపంచకప్‌ టోర్నీ(T20 World Cup-2026)లో ఆడాలని ప్రతి జట్టుకూ ఉంటుందని.. అలానే బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ఐసీసీ ఈవెంట్లలో ఆడాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. ఇలా వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడాలనే కోరిక ఉందంటూనే.. మరోవైపు భారత్‌ గురించి బీసీబీ అధ్యక్షుడు ఇస్లాం అతిగా మాట్లాడాడంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బుధవారం జరిగిన ఐసీసీ అత్యవసర సమావేశం.. బంగ్లాదేశ్‌కు గట్టి షాకిచ్చింది. బీసీబీ తమ పంతం వీడకపోతే ఆ జట్టును ప్రపంచ కప్ టోర్నీ నుంచి తప్పిస్తామని ఐసీసీ హెచ్చరించింది. వారి స్థానంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌ జట్టును ఆడించాలని కూడా ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ(ICC) మీటింగ్‌లో ఈ అంశానికి మద్దతుగా అత్యధిక డైరెక్టర్లు ఓటు వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చరిత్ర సృష్టించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు

అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఒక అద్భుతం!

Updated Date - Jan 22 , 2026 | 04:01 PM