Share News

ICC: జనవరి 21లోగా ఏదో ఒకటి తేల్చుకోండి.. బీసీబీకి ఐసీసీ డెడ్‌లైన్!

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:42 AM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌లో బంగ్లా ఆడనున్న మ్యాచుల వేదికలను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి మెయిల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ.. బీసీబీకి ఈ విషయంపై డెడ్‌లైన్ విధించినట్లు సమాచారం.

ICC: జనవరి 21లోగా ఏదో ఒకటి తేల్చుకోండి.. బీసీబీకి ఐసీసీ డెడ్‌లైన్!
ICC

ఇంటర్నెట్ డెస్క్: భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్(IPL) నుంచి తప్పించడంతో బంగ్లా ప్రభుత్వంతో పాటు బంగ్లా క్రికెట్ బోర్డు కూడా తీవ్రంగా స్పందించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ రానున్న టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్‌లో బంగ్లా ఆడనున్న మ్యాచుల వేదికలను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) ఐసీసీకి మెయిల్ చేసింది. అయితే.. ఈ మెగాటోర్నీకి చాలా తక్కువ సమయమున్న నేపథ్యంలో వేదికల తరలింపు సాధ్యం కాదని ఐసీసీ.. బీసీబీకి మరోసారి తేల్చి చెప్పినట్టు సమాచారం.


టీ20 వరల్డ్‌ కప్‌ 2026 భారత్‌, శ్రీలంక వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7 నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇంత తక్కువ సమయంలో వేదికల మార్పు అసాధ్యమని ఐసీసీ(ICC) చెబుతూ వస్తోంది. అయినా బీసీబీ వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో బీసీబీకి ఐసీసీ జనవరి 21ని డెడ్‌లైన్‌గా విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఒకవేళ బంగ్లాదేశ్ తన మొండిపట్టు వీడకుంటే.. దాని స్థానంలో స్కాట్లాండ్ జట్టు వరల్డ్ కప్ మ్యాచులు ఆడే అవకాశం ఉంది.


ఈ వేదికల మార్పు విషయంపై చర్చించేందుకు ఐసీసీ అధికారులు ఢాకా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన సమావేశంలోనే ఈ డెడ్‌లైన్‌ను ఐసీసీ.. బీసీబీకి విధించినట్లు తెలుస్తోంది. ఈ వారంలో రెండుసార్లు ఐసీసీ, బీసీబీ మధ్య చర్చలు జరిగాయి. భారత్‌కు వెళ్లి మ్యాచ్‌లు ఆడబోమని తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు ఉన్నాయని బంగ్లా మరోసారి స్పష్టం చేసింది. అయితే.. ఐసీసీ మాత్రం షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులూ సాధ్యం కావని చెబుతూ వస్తోంది. అలాగే భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పూ వాటిల్లే అవకాశం లేదని ఐసీసీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 21లోగా భారత్‌కు రావడానికి బీసీబీ ఒప్పుకోకపోతే.. ఐసీసీ ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ టీమ్‌ ఆ ఛాన్స్‌ దక్కించుకోనుంది.


ఇవి కూడా చదవండి:

భారత్ ఓటమి.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శల వెల్లువ

అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు: సునీల్ గావస్కర్

Updated Date - Jan 19 , 2026 | 12:00 PM