Share News

జెర్సీ రంగు మార్పు వివాదంలో ట్విస్ట్.. వివరణకు ఆదేశించిన హాకీ ఇండియా అధ్యక్షుడు

ABN , Publish Date - Jul 31 , 2026 | 05:15 PM

భారత హాకీ జట్ల జెర్సీ రంగు మార్పు వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై ఎగ్జిక్యూటివ్ బోర్డు అధికారులను వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ లేఖ రాశారు.

జెర్సీ రంగు మార్పు వివాదంలో ట్విస్ట్.. వివరణకు ఆదేశించిన హాకీ ఇండియా అధ్యక్షుడు
Dilip Tirkey

ఇంటర్నెట్ డెస్క్: భారత హాకీ జట్ల జెర్సీ రంగు మార్పు వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై ఎగ్జిక్యూటివ్ బోర్డు అధికారులను వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ లేఖ రాశారు. భారత పురుషులు, మహిళల జట్ల నీలం జెర్సీని కాషాయ రంగులోకి మార్చే నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్ బోర్డు ముందుకు తీసుకురాకుండానే అమలు చేశారని, తనకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన టిర్కీ.. తాజాగా దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేయడం చర్చకు దారి తీసింది.


జాతీయ జట్టు గుర్తింపుతో ముడిపడిన ఇలాంటి కీలక నిర్ణయాలు ఎన్నికైన నాయకత్వం, ఎగ్జిక్యూటివ్ బోర్డుతో చర్చించిన తర్వాతే తీసుకోవాల్సిందని టిర్కీ పేర్కొన్నారు. ఈ అంశంపై ఒడిశా ప్రభుత్వం కూడా తనను వివరణ కోరిందని, అందుకే నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఎలాంటి ప్రక్రియ అనుసరించారు? ఎవరి అనుమతితో అమలు చేశారనే వివరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తదుపరి మెయిల్‌లో కూడా ఆయన ఐదు కీలక ప్రశ్నలు సంధిస్తూ, బోర్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో స్పష్టం చేయాలని కోరారు. దీంతో హాకీ ఇండియాలో అంతర్గత విభేదాలు బహిర్గతమైనట్లు చర్చ జరుగుతోంది.


అయితే అంతర్జాతీయ హాకీలో అంతటా వాడుతున్న సింథటిక్ పిచ్‌లు నీలి రంగులో ఉంటాయి. జెర్సీలు కూడా అదే రంగులో ఉంటే కలిసిపోతున్నాయని.. అందుకే ఆటగాళ్లు, కోచ్‌ల సూచనతో జాతీయ జెండాలో భాగమైన కాషాయాన్ని ఎంపిక చేశామని హాకీ ఇండియా పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే జెర్సీ రంగు మార్పుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

2027 వన్డే ప్రపంచ కప్‌.. భువీని జట్టులోకి తీసుకోవాలి: అశ్విన్

అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి.. రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ పోస్ట్

Updated Date - Jul 31 , 2026 | 05:19 PM