అసలు నిజాన్ని దాచేందుకు ప్రయత్నించారు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు..
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:39 AM
ఆస్ట్రేలియాలో ఎనిమిదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బాల్ ట్యాంపరింగ్ వివాదం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో ఆ వివాదం గురించి సంచలన విషయాలు వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో ఎనిమిదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బాల్ ట్యాంపరింగ్ వివాదం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో ఆ వివాదం గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీవ్ర ఆరోపణలు చేశాడు. 2018లో జరిగిన విచారణలో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్లను ఎందుకు విచారించలేదని ప్రశ్నించాడు (David Warner about Sandpapergate).
అసలు నిజాన్ని దాచిపెట్టేందుకు అప్పట్లో విచారణను సరిగా నిర్వహించలేదని, ఇదంతా ఓ కప్పిపుచ్చే ప్రయత్నంలా కనిపిస్తోందని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియాను వార్నర్ విమర్శించాడు. వార్నర్ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ తీరును ప్రశ్నించాడు. తనకు తెలిసినంతవరకు 2018లో జరిగిన విచారణలో హేజిల్‌వుడ్, స్టార్క్, లైయన్లను అధికారులు ప్రశ్నించలేదని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో ఎవరిని బాధ్యులుగా చేయాలనేది ముందుగానే నిర్ణయించుకుని విచారణ జరిపినట్లు కనిపిస్తోందని ఆరోపించాడు (Ball Tampering Scandal).
వార్నర్ ఆరోపణలపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. 2018లో జరిగిన విచారణ సమయంలో ఆటగాళ్లందరికీ తమ వాదనను వినిపించే అవకాశం ఇచ్చామని తెలిపింది (Ball Tampering Scandal). అంతేకాకుండా గత ఎనిమిదేళ్లలో కొత్త ఆధారాలు ఉంటే వాటిని వెల్లడించేందుకు కూడా అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరిపే ఆలోచన లేదని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్బర్గ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఖవాజా పుస్తకంలోని వివరాలు ఇతర ఆటగాళ్లు వెల్లడించిన విషయాలకు భిన్నంగా ఉన్నాయని, ప్రస్తుతానికి పాత విచారణను తిరిగి తెరవాల్సిన అవసరం కనిపించడం లేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. చైనాలో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ..
పసిడి ధరలు మరింత కిందకు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..