అదరగొట్టిన మంధాన
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:29 AM
మహిళల టీ20 ఆసియాక్‌పలో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 124) రికార్డు శతకంతో చెలరేగింది.
57 బంతుల్లోనే శతకం
సెమీస్‌లో భారత్
137 రన్స్ తేడాతో హాంకాంగ్ చిత్తు
దుబాయ్: మహిళల టీ20 ఆసియాక్‌పలో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 124) రికార్డు శతకంతో చెలరేగింది. మిడిలార్డర్ విఫలమైనా ఇన్నింగ్స్ ఆద్యంతం క్రీజులో నిలిచి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. అటు బౌలర్లు సైతం తమ సత్తా చూపడంతో గురువారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 137 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే గ్రూప్ ‘ఎ’లో హర్మన్‌ప్రీత్ సేన నాలుగు పాయింట్లతో నాకౌట్‌కు చేరింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసింది. షఫాలీ (28) ఫర్వాలేదనిపించింది. మరీనాకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత బౌలర్ల ముందు హాంకాంగ్ ఏమాత్రం నిలువలేకపోయింది. దీంతో 16.2 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ నటాషా (15) టాప్ స్కోరర్. దీప్తి శర్మకు మూడు.. నందని, ప్రేమ, శ్రీచరణిలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా మంధాన నిలిచింది.
అంతా తానై..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మంధాన ఆట మాత్రమే హైలైట్‌గా నిలిచింది. ఇక ఎప్పటిలాగే మిడిలార్డర్ వైఫల్యం కనిపించింది. ఒక్కో బ్యాటర్ కనీసం 20 బంతులైనా ఆడలేక పెవిలియన్‌కు వరుస కట్టారు. అయితే తొలి నాలుగు ఓవర్లు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో మంధాన, షఫాలీ సైతం ఆచితూచి ఆడారు. ఐదో ఓవర్‌లో మంధాన మూడు ఫోర్లు, తర్వాతి ఓవర్‌లో షఫాలీ 4,6,4,6తో చెలరేగగా పవర్‌ప్లేలో భారత్ 60 రన్స్‌కు చేరుకుంది. ఎనిమిదో ఓవర్‌లో షఫాలీ వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఆ తర్వాత మంధాన షో ఆరంభమైంది. మరో ఎండ్‌లో సహకారం లభించకపోయినా.. తను మాత్రం ఎదురుదాడి ఆపలేదు. చకచకా బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డులో వేగం పెంచింది. 96 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మంధాన ఓ ఫోర్‌తో 57 బంతుల్లో కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేసింది. అలాగే 18వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో అదరగొట్టింది. తన అద్భుత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ మూడో బంతికి రనౌట్ రూపంలో ముగిసినా అప్పటికే జట్టు భారీ స్కోరందుకుంది.
మహిళల అంతర్జాతీయ క్రికెట్ (అన్ని ఫార్మాట్లలో కలిపి) లో ఎక్కువ పరుగులు (10,880) సాధించిన బ్యాటర్‌గా నిలిచిన మంధాన.. మిథాలీ రాజ్ (10,868)ను అధిగమించింది. అలాగే ఎక్కువ శతకాలు (18) బాదిన బ్యాటర్‌గానూ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో మెగ్ లానింగ్ (17), లారా వోల్వార్డ్ (17) లను దాటేసింది.
మహిళల ఆసియాక్‌పలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (124) సాధించిన బ్యాటర్‌గా మంధాన. చమరి ఆటపట్టు (119)ను అధిగమించింది.
భారత మహిళల జట్టు తరఫున టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు (95) బాదిన బ్యాటర్‌గా మంధాన.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 193/5 (మంధాన 124, షఫాలీ 28; మరీనా 2/46)
హాంకాంగ్: 16.2 ఓవర్లలో 56 ఆలౌట్. (నటాషా 15; దీప్తి శర్మ 3/9, నందని 2/6, ప్రేమ 2/12, శ్రీచరణి 2/16)
ఇవి కూడా చదవండి:
పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి
వృద్ధురాలిని ఎత్తుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి