250.. ఊదేశారు
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:17 AM
వెస్టిండీస్ ముందు 250 పరుగుల లక్ష్యం.. మంచు ప్రభావం ఉన్నప్పటికీ ఇంత భారీ ఛేదన కష్టమేనని అంతా భావించారు. దీనికి తోడు తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు ఫట్. అయితే పొట్టి ఫార్మాట్‌లో తామెంత ప్రమాదకరమో కరీబియన్లు చాటి చెప్పారు.
రెండో టీ20లో భారత్‌పై విండీస్ విజయం
కెప్టెన్ హోప్ అజేయ శతకం
చెలరేగిన రూథర్‌ఫోర్డ్, షెఫర్డ్
శాంసన్ పోరాటం వృథా
రాంచీ: వెస్టిండీస్ ముందు 250 పరుగుల లక్ష్యం.. మంచు ప్రభావం ఉన్నప్పటికీ ఇంత భారీ ఛేదన కష్టమేనని అంతా భావించారు. దీనికి తోడు తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు ఫట్. అయితే పొట్టి ఫార్మాట్‌లో తామెంత ప్రమాదకరమో కరీబియన్లు చాటి చెప్పారు. కేవలం బౌండరీల రూపంలోనే 204 పరుగులు సాధించి ఇదీ తమ ఆటంటూ భారత బౌలర్లను బెంబేలెత్తించారు. ముఖ్యంగా కెప్టెన్ షాయ్ హోప్ (45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 102 నాటౌట్) తన అసాధారణ ఫామ్‌తో తుదికంటా నిలిచాడు. అతడికి రూథర్‌ఫోర్డ్ (37 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 84) జత కలవగా.. ఆఖర్లో షెఫర్డ్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 నాటౌట్) మోతెక్కించాడు.
దీంతో శుక్రవారం భారత్‌తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో విండీస్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. అలాగే సిరీస్‌లో 1-1తో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 249 పరుగులు చేసింది. శాంసన్ (41 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82), తిలక్ వర్మ (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 నాటౌట్), ఇషాన్ (22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 43), శ్రేయాస్ (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40) వేగంగా ఆడారు. చేజ్‌కు మూడు, స్ర్పింగర్‌కు 2వికెట్లు దక్కాయి. ఛేదనలో విండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 252 పరుగులు చేసి గెలిచింది. మయాంక్‌కు 3 వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హోప్ నిలిచాడు.
ఏమా బాదుడు?: భారీ ఛేదనలో ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా విండీస్ బ్యాటర్లు వెనుకంజ వేయలేదు. కెప్టెన్ హోప్, రూథర్‌ఫోర్డ్ హిట్టింగ్‌తో భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. అలాగే పోవెల్ (24) క్రీజులో ఉన్నంతసేపు బ్యాట్ ఝుళిపించి ఆరో ఓవర్‌లో వెనుదిరిగాడు. అటు హోప్ బౌండరీలతో హోరెత్తించగా, రూథర్‌ఫోర్డ్ వచ్చీ రాగానే చెలరేగాడు.దీంతో పవర్‌ప్లేలో విండీస్ 72/3తో నిలిచింది. రూథర్‌ఫోర్డ్ 12వ ఓవర్‌లో 6,4,4,6తో 23 రన్స్ రాబట్టాడు. 24 బంతుల్లోనే అతడి ఫిఫ్టీ పూర్తవడం విశేషం. చివరకు 15వ ఓవర్‌లో కుల్దీప్‌నకు చిక్కడంతో రూథర్‌ఫోర్డ్ జోరుకు తెరపడింది. హోప్‌నకు షెఫర్డ్ జత కట్టడంతో బౌలర్ల కష్టాలు మరింతగా పెరిగాయి. 17వ ఓవర్‌లో 24 రన్స్ రాగా భారత్ ఓటమి ఖరారైంది. 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో హోప్ 45 బంతుల్లోనే సెంచరీతో పాటు మ్యాచ్‌ను ముగించాడు.
ఆరంభం.. ముగింపు అదుర్స్: టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోప్ మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ దూకుడైన ఆట హైలైట్‌గా నిలిచింది. అయితే 6, 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద శాంసన్ క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలివేయడం కలిసివచ్చింది. డెత్ ఓవర్లలో తిలక్, కెప్టెన్ శ్రేయా స్ ఎడాపెడా బాదేయడంతో స్కోరు 245 దాటగలిగింది. అభిషేక్ (20) ఈసారి కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. సంజూ ఆరో ఓవర్లోనే ఫిఫ్టీని పూర్తి చేశాడు. అటు పవర్‌ప్లేలో భారత్ 79/1 స్కోరుతో నిలిచింది. అయితే చక్కగా కుదురుకున్న ఇషాన్‌ను 12వ ఓవర్‌లో స్పిన్నర్ చేజ్ బౌల్డ్ చేశాడు.
దీంతో రెండో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన దూబే (7)ను సైతం తన తర్వాతి ఓవర్‌లోనే చేజ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అటు శాంసన్ భారీ షాట్‌కు వెళ్లి పేసర్ స్ర్పింగర్‌కు చిక్కాడు. అనంతరం తిలక్-శ్రేయాస్ విజృంభణ సాగింది. 17వ ఓవర్‌లో శ్రేయాస్ రెండు సిక్సర్లు, తర్వాతి ఓవర్‌లో అతడి 6,4 తిలక్ 4,4తో పరుగుల వరద పారింది. ఆఖరి ఓవర్‌లో తిలక్ మరింతగా చెలరేగి హ్యాట్రిక్ సిక్సర్లు బాదగా.. శ్రేయాస్ ఐదో బంతికి వెనుదిరిగాడు. మొత్తంగా చివరి ఐదు ఓవర్లలో భారత్ ఏకంగా 80 పరుగులు రాబట్టింది.
వెస్టిండీస్‌పై వేగవంతమైన (21 బంతుల్లో) అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా శాంసన్. విరాట్‌తో సమంగా నిలిచాడు.
అంతర్జాతీయ టీ20ల్లో రెండో భారీ ఛేదన (250)ను నమోదు చేసిన జట్టుగా వెస్టిండీస్. దక్షిణాఫ్రికా (విండీస్‌పై 259) టాప్‌లో ఉంది.
స్కోరుబోర్డు
భారత్: అభిషేక్ (సి) మోటీ (బి) చేజ్ 20, శాంసన్ (సి) కమిల్ (బి) స్ర్పింగర్ 82, ఇషాన్ (బి) చేజ్ 43, దూబే (బి) చేజ్ 7, శ్రేయాస్ (సి) హెట్‌మయెర్ (బి) స్ర్పింగర్ 40, తిలక్ (నాటౌట్) 44, నమన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 249/5. వికెట్ల పతనం: 1-42, 2-139, 3-158, 4-162, 5-245; బౌలింగ్: హోసీన్ 3-0-46-0, షెఫర్డ్ 3.4-0-47-0, చేజ్ 4-0-24-3, మోటీ 2-0-21-0, జోసెఫ్ 3-0-39-0, స్ర్పింగర్ 4-0-64-2, పోవెల్ 0.2-0-7-0.
వెస్టిండీస్: హోప్ (నాటౌట్) 102, కమిల్ (సి-సబ్) బిష్ణోయ్ (బి) మయాంక్ 4, హెట్‌మయెర్ (బి) మయాంక్ 0, పోవెల్ (బి) మయాంక్ 24, రూథర్‌ఫోర్డ్ (సి) శాంసన్ (బి) కుల్దీప్ 84, షెఫర్డ్ (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 18.3 ఓవర్లలో 252/4; వికెట్ల పతనం: 1-5, 2-5, 3-58, 4-178; బౌలింగ్: మయాంక్ 3-0-36-3, అర్ష్‌దీప్ 4-0-45-0, అక్షర్ 3.3-0-63-0, దూబే 2-0-30-0, కుల్దీప్ 4-0-53-1, నమన్ 2-0-25-0.
ఇవి కూడా చదవండి:
పోలీస్ మహిళా సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..
పదేళ్ల తర్వాత జట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!
బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు