ఈ ఆటంకాలు దాటితేనే సూర్యసేన ట్రోఫీని ముద్దాడేది.. లేకుంటే ..?
ABN , Publish Date - Mar 03 , 2026 | 10:00 AM
మార్చి 5న ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత్ జట్టులో కొన్ని బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవే టీమిండియా అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో ఉత్కంఠ రేపిన మ్యాచుల్లో భారత్, వెస్డిండీస్ మ్యాచ్ ఒకటి. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక మార్చి 5న ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత్ జట్టులో కొన్ని బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ బలహీనతలు స్పష్టంగా కనిపించాయి. వీటిని అధిగమించకపోతే సూర్య సేన ట్రోఫీ గెలిచే ఆశలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
అభిషేక్ శర్మ ఫామ్‌పై ఆందోళన
ఈ టోర్నమెంట్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఆశించిన విధంగా సాగలేదు. టోర్నీలో మొదటి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా డకౌట్ అయ్యాడు. తరువాత సౌతాఫ్రికా మ్యాచ్‌లో 15 పరుగులు, జింబాబ్వేపై అర్ధశతకం సాధించాడు. జింబాబ్వే మ్యాచ్ తో అభిషేక్ ఫామ్‌లోకి వచ్చాడని అందరూ భావించారు. కానీ వెస్టిండీస్‌పై కీలకమైన మ్యాచ్‌లో కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. అలానే కెప్టెన్ సూర్య కుమార్ కూడా ఆశించిన మేర రాణించడం లేదు. అమెరికాపై అర్ధశతకం చేసిన తర్వాత స్థిరంగా రాణించలేకపోతున్నాడు. వీరిద్దరు ఇంగ్లండ్‌పై ఫామ్‌లోకి రాకపోతే భారత్‌కు పెద్ద సవాలే.
ఫీలింగ్డ్ సమస్య
ఈ ఐసీసీ టోర్నీలో టీమిండియాకు ఫీల్డింగ్ పెద్ద సమస్యగా మారింది. సూపర్-8 దశలో అత్యధిక క్యాచ్‌లు వదిలిన జట్టుగా భారత్ నిలవడమే అందుకు నిదర్శనం. లీగ్ దశ నుంచి సూపర్ -8 వరకు పలు మ్యాచుల్లో టీమిండియా ప్లేయర్లు కీలక క్యాచులను జారవిడిచారు. ఇక వెస్టిండీస్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి సులభమైన రన్ ఔట్ అవకాశం వదిలేయగా, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ కీలక క్యాచ్‌లు మిస్ చేశారు. వెస్టిండీస్ 20 ఓవర్లలో 195 పరుగులు చేయడానికి ఇవే ప్రధాన కారణాలు. ఈ టోర్నమెంట్ మొత్తంగా భారత్ 13 క్యాచ్‌లు వదిలింది. క్యాచ్ సక్సెస్ రేట్ కేవలం 71.7 శాతం మాత్రమే.
చివరి 5 ఓవర్లలో పరుగుల వరద
ఈ టోర్నీలో డెత్ ఓవర్లలో టీమిండియా బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. దాదాపు అన్ని మ్యాచుల్లో డెత్ ఓవర్లలో భారత్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. వెస్టిండీస్ మ్యాచ్‌లో చివరి ఓవర్లలో 46 పరుగులు ఇచ్చారు. జింబాబ్వే మ్యాచ్‌లో 40 పరుగులు. సౌతాఫ్రికా మ్యాచ్‌లో 35 పరుగులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. నాకౌట్ దశలో చిన్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ భారత్ కు అనివార్యం. మొత్తంగా సెమీస్ లో ఇంగ్లండ్ లాంటి బలమైన జట్టును ఎదుర్కోవాలంటే టీమిండియా ఈ అంశాల్లో మెరుగవాల్సి ఉంది. లేకపోతే సూర్య సేన ట్రోఫీ అందుకోవడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
తనకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరో చెప్పిన సంజు