Share News

ఆషామాషీ కాదు

ABN , Publish Date - Mar 03 , 2026 | 05:34 AM

అంచనాలకు తగ్గ ఆటతీరుతో టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ సెమీ్‌సలో అడుగుపెట్టింది. ఇక గురువారం వాంఖడే మైదానంలో జరిగే రెండో సెమీ్‌సలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే ప్రత్యర్థిని ఓడించి...

 ఆషామాషీ కాదు

ఇంగ్లండ్‌తో సవాల్‌ తప్పదు జూశాంసన్‌పై నమ్మకముంది

  • జూటీమిండియా చీఫ్‌ కోచ్‌ గంభీర్‌

న్యూఢిల్లీ: అంచనాలకు తగ్గ ఆటతీరుతో టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ సెమీ్‌సలో అడుగుపెట్టింది. ఇక గురువారం వాంఖడే మైదానంలో జరిగే రెండో సెమీ్‌సలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే ప్రత్యర్థిని ఓడించి తుది పోరులోకి అడుగుపెట్టాలంటే శక్తికి మించిన ఆటతీరును చూపాల్సి ఉంటుందని ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ భారత ఆటగాళ్లను హెచ్చరించాడు. అలాగే వెస్టిండీ్‌సపై చెలరేగిన సంజూ శాంసన్‌ను ప్రత్యేకంగా కొనియాడాడు. ‘ఇంగ్లండ్‌ వరల్డ్‌ క్లాస్‌ టీమ్‌. జట్టులో ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు కొదవలేదు. వాంఖడేలో జరగబోయే మ్యాచ్‌కు ఎంతటి ప్రాధాన్యముందో మనకు తెలుసు. అందుకే జట్టు కోసం, దేశం కోసం మరో అద్భుతం చేసేందుకు మనందరికీ దక్కిన అవకాశంగా దీన్ని భావించాలి. ఇందుకోసం జట్టు నుంచి మెరుగైన ప్రదర్శన వస్తుందనే ఆశిస్తున్నా’ అని గంభీర్‌ తెలిపాడు. ఇక శాంసన్‌ నైపుణ్యంపై తనకు ఎలాంటి సందేహాలు లేవని, తనో అత్యుత్తమ ఆటగాడంటూ గౌతీ పేర్కొన్నాడు. అందుకే అతనికి మద్దతుగా నిలిచామని, విండీ్‌సపై తన సత్తా ఏంటో చూపి జట్టును ఆదుకున్నాడని చెప్పాడు.

మూడోసారి ఎవరో..?

టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు ఇదివరకు రెండుసార్లు సెమీఫైనల్స్‌లో తలపడ్డాయి. గురువారం ముచ్చటగా మూడోసారి ఫైనల్లో చోటు కోసం బరిలోకి దిగబోతున్నాయి. అయితే 2022లో తొలిసారి తలపడినప్పుడు భారత్‌ను ఓడించిన ఇంగ్లండ్‌ ఫైనల్లో ప్రవేశించింది. అలాగే టైటిల్‌ పోరులో పాక్‌ను చిత్తు చేసింది. ఇక 2024లో జరిగిన సెమీ్‌సలో మాత్రం రోహిత్‌ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్‌ను మట్టికరిపించి, ఫైనల్లో సఫారీలను ఓడించి విజేతగా నిలిచింది. మరో విశేషమేమిటంటే.. ఈ రెండుసార్లు కూడా ఈ రెండు జట్ల మధ్య సెమీ్‌సలో గెలిచిన జట్టే చాంపియన్‌గా అవతరించింది. ఇక వాంఖడేలో ఇంగ్లండ్‌ ఇప్పటివరకు ఆరు టీ20లు ఆడి 3-3 రికార్డుతో ఉంది. అటు భారత్‌ ఏడు మ్యాచ్‌లు ఆడి 5 నెగ్గింది. చివరిసారిగా మన జట్టు ఇక్కడ 2017లో ఓడడం గమనార్హం. అలాగే వాంఖడేలో భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన రెండు టీ20ల్లో చెరో విజయంతో సమానంగా ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ మెగా టోర్నీలో ఇరు జట్లూ ఐదుసార్లు తలపడగా.. భారత్‌ 3-2తో ఆధిక్యంలో ఉంది.


సెల్‌ఫోన్‌,

సోషల్‌ మీడియాకు దూరంగా..

న్యూఢిల్లీ: ఓపెనర్‌ సంజూ శాంసన్‌ ఒంటిచేత్తో భారత్‌ను టీ20 వరల్డ్‌కప్‌ సెమీ్‌సకు చేర్చాడు. అయితే, అంతకుముందు ఫామ్‌ కోల్పోయిన సంజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తుది జట్టులో కూడా చోటు కష్టంగా మారింది. కానీ, అదృష్టవశాత్తూ దక్కిన అవకాశాన్ని సంజూ ఈసారి ఒడిసిపట్టుకొన్నాడు. ఈ నేపథ్యంలో ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నప్పుడు తాను సెల్‌ఫోన్‌, సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నట్టు శాంసన్‌ తెలిపాడు. ఎన్నోసార్లు నిరాశే ఎదురైనా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని చెప్పాడు. ‘షాట్‌ సెలెక్షన్‌పై ఎక్కువగా దృష్టిసారించా. కానీ, నా ఆటలో పెద్దగా మార్పులు చేయలేదు. సోషల్‌ మీడియా, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉన్నా. అంతరాత్మ చెప్పిందే విన్నా’ అని శాంసన్‌ చెప్పాడు. కీలక మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. ‘ఈడెన్‌ గార్డెన్స్‌లో 190పైగా స్కోరు ఛేదించడం సులువేనని భావించా. కానీ, క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకోవడంతో జట్టును గెలిపించడం సవాల్‌గా మారింది. ఇలాంటి సమయంలో నా అనుభవం ఉపయోగపడింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తుదికంటా నిలవాలని అనుకొన్నా. తీవ్ర ఒత్తిడి నెలకొన్నా.. రిస్క్‌ తీసుకోకుండా బౌండ్రీలు సాధిస్తూ స్కోరు బోర్డును నడిపించా’ అని తెలిపాడు.

ఇన్నాళ్లూ కొందరి గురించే మాట్లాడాం..

ప్రస్తుత భారతజట్టులో ప్రతీ ఆటగాడు విజయంలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడని గంభీర్‌ ప్రశంసించాడు. గతంలోనైతే ఫలానా ఆటగాళ్ల గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్లమని పరోక్షంగా స్టార్‌ కల్చర్‌ను గుర్తుచేశాడు. ‘క్రికెట్‌ అనేది జట్టు ఆట. ఎప్పటికీ అలాగే ఉండాలి. నా దృష్టిలో అయితే విండీ్‌సపై దూబే రెండు ఫోర్లు కూడా శాంసన్‌ 97 రన్స్‌తో సమానం. అతను ఆడకపోయుంటే శాంసన్‌ ఇన్నింగ్స్‌ గురించి చెప్పుకొనే వాళ్లం కాదు. భారీ ఇన్నింగ్స్‌ ప్రధానంగా నిలుస్తాయి. కానీ ఇలాంటి చిన్న ఇన్నింగ్స్‌ కూడా జట్టు విజయాల్లో కీలకంగా మారతాయి. కోచ్‌గా నేనున్నంతకాలం ఇలాంటి దృక్పథంతోనే ముందుకు సాగుతా’ అని గంభీర్‌ స్పష్టం చేశాడు.

88-Sports.jpg


ఏడిపిస్తావా.. ఏంటి?

సంజూ శాంసన్‌ ఇన్నింగ్స్‌పై కెప్టెన్‌ సూర్యకుమార్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘మంచి వాళ్లకు మంచే జరుగుతుంది. ఇదంతా అతడి శ్రమ వల్లే సాధ్యమైంది. అతడు ఆడిన విధానం జట్టుకు విజయాన్నందించింది’ అని సూర్య కొనియాడాడు. అతడు ఎదుర్కొన్న క్లిష్టపరిస్థితుల గురించి మాత్రం పెద్దగా చెప్పలేదు. కాగా, ‘ఈ సమయంలో నన్ను ప్రశంసించి.. కన్నీళ్లు పెట్టుకొనేలా చేస్తావా? ఏంటి?’ అని సూర్యతో శాంసన్‌ సరదాగా అన్నాడు. ఈ వీడియోను బీసీసీఐ నెట్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

ఆ అవార్డు సంజూకు కాదు..

కోల్‌కతా: ప్రతి మ్యాచ్‌లో ప్రభావం చూపే ఆటగాడికి ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును అందజేయడం భారత జట్టు యాజమాన్యం సంప్రదాయంగా పాటిస్తోంది. ఈక్రమంలో వెస్టిండీస్‌తో పోరులో ఆ అవార్డు సహజంగానే సంజూ శాంసన్‌కు లభిస్తుందని అనుకుంటాం. కానీ ఆశ్చర్యకరంగా ఆ పురస్కారం.. పేస్‌ దళపతి జస్ర్పీత్‌ బుమ్రాకు దక్కింది. నాలుగు ఓవర్లు బౌల్‌ చేసిన బుమ్రా 36 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో హెట్‌మయెర్‌, రోస్టన్‌ చేజ్‌ వికెట్లను బుమ్రా తీశాడు. ఆ ఇద్దరు ప్రమాదకర ఆటగాళ్లను ఒకే ఓవర్‌లో అదీ మూడు బంతుల తేడాతో అవుట్‌ చేసిన బుమ్రాకు అవార్డు అందజేసినట్టు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?

అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు

Updated Date - Mar 03 , 2026 | 05:34 AM