జింబాబ్వేపై వెస్టిండీస్ గెలుపు.. టీమిండియాకు కష్టాలు!
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:03 PM
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విండీస్ సాధించిన ఈ భారీ గెలుపు కారణంగా టీమిండియా సెమీఫైనల్ ఆశలు సంక్లిష్టమయ్యాయి.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విండీస్ సాధించిన ఈ భారీ గెలుపు కారణంగా టీమిండియా సెమీఫైనల్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. అంతేకాకుండా.. సెమీస్ రేసులో కొనసాగాలంటే భారత జట్టుకు భారీ విజయాలు అనివార్యంగా మారాయి.
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 111 పరుగులకే ఆలౌట్ కావడంతో నెట్ రన్‌రేట్ గణనీయంగా పడిపోయింది. 76 పరుగుల భారీ ఓటమితో టీమిండియా నెట్ రన్‌రేట్ -3.800కి పడిపోయింది. గ్రూప్-1లో భారత్‌కు ఇంకా రెండు కీలక మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ మ్యాచుల్లో జింబాబ్వే, వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. టీమిండియా సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవడమే కాకుండా, నెట్ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచాల్సిన అవసరముంది. తదుపరి మ్యాచ్ జింబాబ్వేతో ఉండటంతో.. టీమిండియా వ్యూహమంతా నెగిటివ్‌లో ఉన్న నెట్ రన్‌రేట్‌ను పాజిటివ్‌గా మార్చడంపైనే ఆధారపడి ఉంటుంది. భారత్ ముందుగా బౌలింగ్ చేస్తే, జింబాబ్వేను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసి, లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించాలి.
ఉదాహరణకు జింబాబ్వే మొదటి బ్యాటింగ్ చేసి.. 90 పరుగులు మాత్రమే చేస్తే.. భారత్ 9 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. అలా చేస్తేనే నెట్ రన్‌రేట్‌లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఒకవేళ టార్గెట్ 150 పరుగులు ఉంటే.. భారత్ 11 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. అలాకాకుండా టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తే నెట్ రన్‌రేట్‌ను నెగటివ్ నుంచి పాజిటివ్‌గా మార్చడం చాలా కష్టం అవుతుంది. మొదట బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితిలో భారత్ కనీసం 200 నుంచి 240కి పైగా పరుగులు చేయాలి. అనంతరం ప్రత్యర్థిని 80-120 లేదా అంతకంటే తక్కువ స్కోర్‌కే కట్టడి చేయాల్సి ఉంటుంది. ఇలా జరిగితేనే భారత్ నెట్ రన్‌రేట్ మెరుగుపడి పాజిటివ్‌కు వస్తుంది, సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. కాగా.. ఈ నెల 26న చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది.
ఇవి కూడా చదవండి:
ఓడినా.. ప్రపంచ రికార్డు సృష్టించిన జింబాబ్వే ప్లేయర్లు
2026 ఫిఫా వరల్డ్ కప్: మెక్సికోలో హింస.. మ్యాచ్‌ల వేదికల మార్పు తప్పదా?