Share News

2026 ఫిఫా వరల్డ్ కప్: మెక్సికోలో హింస.. మ్యాచ్‌ల వేదికల మార్పు తప్పదా?

ABN , Publish Date - Feb 24 , 2026 | 08:13 AM

మెక్సికోలో హింసతో జూన్, జులైలో జరగాల్సిన 2026 వరల్డ్ కప్‌ ఫుట్‌బాల్ మ్యాచ్ వేదికలపై అనిశ్చితి నెలకొంది. డ్రగ్ లార్డ్.. ఎల్ మెంచో హతుడైన తర్వాత మెక్సికోలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆటగాళ్లు, అభిమానుల రక్షణపై ఫిఫా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

2026 ఫిఫా వరల్డ్ కప్: మెక్సికోలో హింస.. మ్యాచ్‌ల వేదికల మార్పు తప్పదా?
FIFA World Cup 2026

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 24: ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మెక్సికోలో పెరిగిపోతున్న హింసాత్మక ఘటనలు, డ్రగ్ కార్టెల్స్, సైన్యం మధ్య ఘర్షణలు ఈ మెగా టోర్నీ నిర్వహణను సందిగ్ధంలో పడేశాయి.

ఉద్రిక్త పరిస్థితుల్లో మెక్సికో

మెక్సికోలోని పలు నగరాల్లో ప్రస్తుతం తీవ్రమైన హింస కొనసాగుతోంది. డ్రగ్ లార్డ్.. ఎల్ మెంచో హతమైన అనంతరం ముఖ్యంగా డ్రగ్ గ్యాంగ్‌లు, సైన్యం మధ్య జరుగుతున్న కాల్పులు, అల్లర్ల వల్ల శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దీంతో క్రీడాకారులు, పర్యాటకులు, అభిమానుల రక్షణపై ఫిఫా (FIFA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

వేదికల మార్పుపై చర్చలు

మెక్సికోలో పరిస్థితి అదుపులోకి రాకపోతే, అక్కడ జరగాల్సిన మ్యాచ్‌లను వేరే దేశాలకు మార్చాలని ఫిఫా యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మెక్సికోలో జరగాల్సిన మ్యాచ్‌లను అమెరికా లేదా కెనడాకు తరలించే అవకాశం ఉంది. క్రీడాకారులు, క్రీడాభిమానుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ఫిఫా.. భద్రతా కారణాల దృష్ట్యా వేదికలను మార్చే అధికారాన్ని కలిగి ఉంది.


2026 వరల్డ్ కప్ ప్రత్యేకత

2026 వరల్డ్ కప్‌ను అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మెక్సికోలో మెక్సికో సిటీ, గ్వాడలజారా, మాంటెర్రే వంటి నగరాల్లో మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. మెక్సికో గతంలో 1970 , 1986లో విజయవంతంగా వరల్డ్ కప్ నిర్వహించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

మెక్సికోలో పెరిగిపోతున్న నేరాలు, డ్రగ్ కార్టెల్స్ హింసతో ఆందోళనలు తీవ్రమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులు, జట్ల భద్రత దృష్ట్యా ఫిఫా ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అధికారికంగా వేదికల మార్పును ప్రకటించనప్పటికీ, ఫిఫా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఒకవేళ మెక్సికో నుంచి మ్యాచ్‌లను తరలిస్తే, అది ఆ దేశ పర్యాటక రంగంపై, ప్రతిష్టపై కోలుకోలేని దెబ్బ తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో ఫిఫా త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

పాపం.. స్నేహితుడికి సాయం చేయాలనుకున్నాడు.. రూ.7 కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్నాడు..

Updated Date - Feb 24 , 2026 | 10:51 AM