ఎందుకీ డ్రామాలు?.. పాక్ ప్లేయర్‌పై స్టువర్ట్ బ్రాడ్ ఫైర్
ABN , Publish Date - Aug 31 , 2026 | 02:46 PM
పాకిస్థాన్ ప్రధాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయంతో వార్మప్ చేయడం అవసరమా? అంటూ మండిపడ్డాడు. ఎందుకీ డ్రామాలని, ఇమామ్ ప్రవర్తన తనకు ఏ మాత్రం నచ్చలేదని ఎద్దేవా చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ చివరి స్థానంలో నిలిచింది. ఈ టెస్టులో గెలిచిన ఇంగ్లండ్, ఓడిన పాక్ రెండూ కూడా ఫైనల్స్‌కు చేరే అవకాశం లేదు. అయితే , రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్టువర్డ్ ఏమన్నాడు, అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం...
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ 389 పరుగుల భారీ టార్గెట్‌ను పాకిస్థాన్ ముందు ఉంచింది. కానీ, పాక్ మాత్రం పోరాటం చేయకుండా 194 పరుగులకే ఆలౌటైంది. ఇక పాక్ జట్టు స్టార్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. అయితే గాయం ఉన్నప్పటికీ అతడు వార్మప్ చేస్తున్న దృశ్యాలు కెమెరాల్లో కనిపించాయి. ఈ వీడియోపైనే స్టువర్ట్ స్పందిస్తూ.. ఇమామ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'ఇమామ్ ఉల్ హక్ వార్మప్ అంతా డ్రామానే. కెమెరాల ముందు షో చేసేందుకే అతను ఇలా చేస్తున్నాడు. మీడియా, తన సహచరుల నుంచి అటెన్షన్ కోసం వార్మప్ చేస్తూ గాయం వల్ల బాధపడుతున్నట్లు నటించాడు. ఈ వార్మప్ అనేది ఎవరూ చూడకుండా గదిలో చేస్తే ఫర్వాలేదు. కానీ షార్ట్స్ వేసుకొని, కాళ్లకు టేప్‌తో మైదానంలోకి వచ్చి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏం ఉంది?. నిజంగా గాయమైతే ఇక్కడ ఎవరూ అడ్డు చెప్పరు కదా?. నాకైతే అతను ప్రవర్తించిన తీరు ఏమాత్రం నచ్చలేదు' అంటూ బ్రాడ్ ఘాటుగా విమర్శించాడు.
స్టువర్ట్ బ్రాడ్ మాత్రమే కాదు.. పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహ్మద్ వసీమ్ కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ చేయకుండా తప్పించుకొనేందుకు ఇమామ్ తన గాయాన్ని కాస్త అతిగా ప్రదర్శించినట్లు అనిపించిందని అభిప్రాయ పడ్డాడు. ఇలా తమ జట్టు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారీ పాకిస్థాన్ ఆటగాళ్లు గాయం డ్రామాలు ఆడుతుంటారని క్రీడా నిపుణులు సైతం ఎద్దేవా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన.. 57 ఏళ్ల రికార్డు బద్దలు
యూఎస్ ఓపెన్: తొలి రౌండ్‌లోనే వీనస్ విలియమ్స్‌కు షాక్