Share News

15 ఏళ్ల క్రితం నాటి సచిన్‌ ఔట్‌పై కామెంట్.. నెట్టింట పాక్‌ క్రికెటర్ నవ్వులపాలు!

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:52 PM

15 ఏళ్ల క్రితం దిగ్గజ క్రికెటర్ సచిన్ ఔట్ అంశంపై తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు.

15 ఏళ్ల క్రితం నాటి సచిన్‌ ఔట్‌పై కామెంట్.. నెట్టింట పాక్‌ క్రికెటర్ నవ్వులపాలు!
Saeed Ajmal

స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ క్రికెటర్లకు సొంత పని మీద కంటే.. పక్కవారి విషయాలపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా భారత్ క్రికెటర్లు అంటే చాలు.. కళ్లలో నిప్పులు పోసుకుంటారు. భారత క్రికెటర్లకు ప్రశంసలు వస్తే.. అసలు ఓర్చుకోలేరు. అలానే భారత్ చేతిలో ఓడిన సందర్భాల్లో ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోకుండా.. సాకులు చెబుతుంటారు. 15 ఏళ్ల క్రితం దిగ్గజ క్రికెటర్ సచిన్ ఔట్ విషయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. నవ్వులపాలయ్యాడు. అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..


2011లో మొహాలీ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన ఓ అంశాన్ని అజ్మల్ మరోసారి గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 85 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, మ్యాచ్ జరుగుతున్న సమయంలో సయీద్ అజ్మల్ వేసిన ఒక ఓవర్లో సచిన్ ఎల్బీడబ్ల్యూ (LBW) ఔట్‌గా అంపైర్ ఇయాన్ గౌల్డ్ ప్రకటించాడు. దీనిపై సచిన్ రివ్యూ (DRS) తీసుకోగా, బంతి లెగ్ స్టంప్‌ను మిస్ అవుతున్నట్లు రిప్లయ్‌లో స్పష్టమైంది. దీంతో థర్డ్ అంపైర్ సచిన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు.


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సయీద్ అజ్మల్.. ఆనాటి డిసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS) పై, థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆరోపణలు చేశాడు. బంతి కచ్చితంగా వికెట్లను తాకుతుందని, కానీ బ్రాడ్‌కాస్టర్లును సచిన్‌ను కాపాడటానికి చివరి రెండు ఫ్రేమ్‌లను కట్ చేసి మార్చేశారంటూ అజ్మల్ తన అక్కసును వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా టీమిండియా అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మ్యాచ్ ఓడిపోయి ఇన్నేళ్లవుతున్నా పాక్ ఆటగాళ్లు ఆ పరాజయాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వింత కథలు చెప్తున్నారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.


ఐసీసీ (ICC) పర్యవేక్షణలో ఉండే అధునాతన డీఆర్ఎస్ టెక్నాలజీని బ్రాడ్‌కాస్టర్లు ఎలా మారుస్తారని, అజ్మల్‌కు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని నెట్టేరు తిట్టిపోస్తున్నారు. 'ఇంకా నయం.. సచిన్ బ్యాట్‌లో స్ప్రింగ్ ఉందని చెప్పలేదు!' అంటూ అజ్మల్ నవ్వులపాలవుతున్న మీమ్స్‌తో నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో తేలిపోయిన విషయాన్ని 15 ఏళ్ల తర్వాత మళ్లీ వివాదస్పదం చేయడానికి ప్రయత్నించి అజ్మల్ సోషల్ మీడియాలో నవ్వులపాలయ్యాడు.


ఇవి కూడా చదవండి:

ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అవమానకర గోల్.. వీడియో వైరల్

జూనియర్ ఆసియా కప్: ఫైనల్‌కు భారత మహిళా హాకీ జట్టు

Updated Date - Sep 12 , 2026 | 05:18 PM