వెస్టిండీస్ ప్లేయర్ హెట్‌మయెర్ ప్రపంచ రికార్డ్.. 40 బంతుల్లో శతకం
ABN , Publish Date - Sep 01 , 2026 | 09:37 PM
వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మయెర్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో చరిత్ర సృష్టించాడు. సీపీఎల్‌లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెట్‌మయెర్ 40 బంతుల్లో శతకం బాదాడు.
స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మయెర్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో చరిత్ర సృష్టించాడు. సీపీఎల్‌లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెట్‌మయెర్ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌పై 40 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 43 బంతుల్లో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సీపీఎల్ చరిత్రలో వేగవంతమైన సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా హెట్‌మయోర్ రికార్డులకెక్కాడు.
గతంలో ఆండ్రూ రస్సెల్, టిమ్ సీఫెర్ట్ చెరో 40 బంతుల్లో శతకం బాదారు. తాజాగా హెట్‌మైర్ కూడా 40 బంతుల్లోనే సెంచరీ సాధించి వారితో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. షెయ్ హోప్ 41 బంతుల్లో సెంచరీ చేసి.. రెండో స్థానంలో ఉన్నాడు. అలానే 42 బంతుల్లో శతకం సాధించిన రస్సెల్ మూడో స్థానంలోనూ కొనసాగుతున్నాడు. ఇక హెట్‌మయెర్ సాధించిన 111 పరుగుల్లో 86 రన్స్ బౌండరీలు రూపంలోనే రావడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా వారియర్స్ 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. హెట్‌మయెర్(111)తో పాటు రొమారియో షెపర్డ్(7 బంతుల్లో 22నాటౌట్)మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నైట్‌రైడర్స్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్, అకిల్ హొసెన్, సునీల్ నరైన్, లాహిరు కుమారాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులకు పరిమితమై ఓటమి చవి చూసింది. అలెక్స్ హేల్స్ (55), కెప్టెన్ నికోలస్ పూరన్ (43) రాణించారు. గయానా బౌలర్లలో మహ్మద్ నబీ మూడు వికెట్లు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
అఫ్గాన్‌తో టీ20 సిరీస్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
పాకిస్థాన్ క్రికెట్‌లో అలజడి.. సెలెక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా!