Share News

సంజూ సూపర్ షో.. కోహ్లీ, రాహుల్ సరసన చోటు

ABN , Publish Date - May 06 , 2026 | 10:27 AM

ఈ ఐపీఎల్ సీజన్‌లో సీఎస్కే తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ సంజూ శాంసన్ అదరగొడుతున్నాడు. డీసీతో నిన్న జరిగిన మ్యాచ్‌లోనూ చక్కటి ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే మరో రికార్డును క్రియేట్ చేశాడు.

సంజూ సూపర్ షో.. కోహ్లీ, రాహుల్ సరసన చోటు
Sanju Samson

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి అద్భుత ఆటతీరు కనబరిచాడు. నిన్న(మంగళవారం) ఢిల్లీలో వేదికగా జరిగిన మ్యాచ్‌లో డీసీపై చెలరేగి ఆడి.. ఒంటిచేత్తో సీఎస్కేను విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. కేవలం 52 బంతుల్లో 87* పరుగులు సాధించి జట్టుకు 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో సంజూ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.


ఒక ఐపీఎల్ సీజన్‌లో ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, కేఎల్.రాహుల్, క్రిస్ గేల్ సరసన చేరాడు. ఈ సీజన్‌లో ఢిల్లీపై గత మ్యాచ్‌లో 115* పరుగులు సాధించిన సంజూ.. తాజా ఇన్నింగ్స్‌తో మొత్తం 202 పరుగులకు చేరుకుని మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లీ (209) అగ్రస్థానంలో ఉండగా.. కేఎల్ రాహుల్(206) రెండో స్థానంలో ఉన్నాడు. దీంతో 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒకే సీజన్‌లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా శాంస‌న్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్(196)ను వెనక్కి నెట్టాడు.


అదేవిధంగా.. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో ఒకే జట్టుపై రెండుసార్లు 100 లేదా అంతకంటే ఎక్కువ భాగస్వామ్యాలు నెలకొల్పిన తొలి బ్యాటర్‌గానూ సంజూ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఫస్ట్ హాఫ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్‌, ఆయుశ్ మాత్రేతో కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ శర్మ(41*)తో కలిసి 3వ వికెట్‌కు 66 బంతుల్లో 114 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని జోడించాడు. ఇలా శాంసన్ అద్భుత ఫామ్ సీఎస్‌కేకు పెద్ద బలంగా మారింది. అతని నిలకడైన ప్రదర్శన జట్టును ప్లే ఆఫ్స్ దిశగా నడిపిస్తోంది.


ఇవీ చదవండి:

తక్కువ ఫీజుతో క్రీడల్లో శిక్షణ

ఐపీఎల్ ఫైనల్ వేదికపై అనిశ్చితి.. బెంగళూరుకు ఛాన్స్ లేనట్టేనా!

Updated Date - May 06 , 2026 | 10:58 AM