Share News

సంజూ శాంసన్‌కు అండగా నిలిచిన అజింక్య రహానే

ABN , Publish Date - Jul 07 , 2026 | 03:57 PM

టీ20 ప్రపంచకప్‌2026ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శాంసన్‌ను పక్కన పెట్టడంపై టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

సంజూ శాంసన్‌కు అండగా నిలిచిన అజింక్య రహానే
Sanju Samson

స్పోర్ట్స్ డెస్క్: జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. టీ20 ప్రపంచకప్‌ 2026ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శాంసన్‌ను పక్కన పెట్టడంపై టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ మేరకు రహానే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.


'ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన హీరోని, జింబాబ్వే పర్యటనకు దూరం పెట్టడం నాకు చాలా వింతగా అనిపించింది. దీనిపై సెలెక్టర్లు శాంసన్‌తో చర్చించి ఉంటారని, సరైన సమాచారం ఇచ్చి ఉంటారని ఆశిస్తున్నాను. అతను త్వరలోనే మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేస్తాడనే నమ్మకం ఉంది' అని రహానే తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఆటగాళ్లకు, సెలెక్షన్ కమిటీకి మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలనే ఉద్దేశంతో రహానే ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.Ajinkya-Rahane.jpg


సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రాణించి, ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్‌కు తదుపరి సిరీస్‌లోనే చోటు దక్కకపోవడంపై అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో సీనియర్లను పక్కన పెడుతున్నారా? లేక శాంసన్‌కు విశ్రాంతినిచ్చారా? అనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా, ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే రోజుల్లో శాంసన్ మళ్లీ జట్టులోకి వచ్చి.. సత్తా చాటుతాడని రహానేతో పాటు కోట్లాది మంది అభిమానులు బలంగా ఆశిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌కు మరో షాక్

సంజును పక్కన పెట్టి మళ్లీ అదే తప్పు చేస్తున్నారు: మహ్మద్ కైఫ్

Updated Date - Jul 07 , 2026 | 05:22 PM