తీవ్రమైన డిప్రెషన్‌లో టీమిండియా మాజీ క్రికెటర్
ABN , Publish Date - May 07 , 2026 | 03:14 PM
టీమిండియా మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోలా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. పూణే సమీపంలోని ఒక పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు అతడి భార్య రియా అంకోలా తెలిపింది.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోలా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. పూణే సమీపంలోని ఒక పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు అతడి భార్య రియా అంకోలా తెలిపింది. తన తల్లి మరణించినప్పటి నుంచి సలీల్ చాలా కలత చెందాడని, ఆమె లేని లోటును జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతున్నాడని రియా అంకోలా వెల్లడించింది. 2024 అక్టోబర్‌లో సలీల్ తల్లి మాలా అశోక్ అంకోలా(77) అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. పుణెలోని తన ఫ్లాట్‌లో గొంతు కోసి ఉన్న స్థితిలో శవమై కనిపించారు.
ఓ జాతీయ మీడియాతో సలీల్ భార్య రియా మాట్లాడుతూ.. ' సలీల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. అందుకే రెండు వారాల క్రితం పూణే సమీపంలోని ఒక మానసిక ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో చేరాడు. అక్టోబర్ 2024లో తన తల్లిని కోల్పోయినప్పటి నుంచి సలీల్ మానసింగా చాలా కుంగిపోయాడు. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అందుకే, ఇటీవల అతను తరచుగా అనారోగ్యానికి గురవుతుండటంతో ప్రశాంతమైన వాతావరణంలో చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు' అని రియా తెలిపింది.
రెండు దశాబ్దాల క్రితం కూడా సలీల్ మద్యపాన వ్యసనం కారణంగా పునరావాసం కేంద్రానికి వెళ్లాడు. సలీల్ అంకోలా అంతర్జాతీయ క్రికెట్‌లో 1989- 1997 మధ్య భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఒక టెస్టు, 20 వన్డేలు ఆడాడు. 1989 నవంబర్‌లో పాకిస్థాన్‌పై సచిన్ టెండూల్కర్‌తో కలిసి అంతర్జాతీయ అరంగేట్రం చేశారు . ఆ మ్యాచ్‌లో ఆయన రెండు వికెట్లు పడగొట్టారు. జాతీయ స్థాయిలో ఆయన ముంబై, మహారాష్ట్ర తరఫున 54 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 181 వికెట్లు పడగొట్టారు. ఈ ఫాస్ట్‌బౌలర్ పలు హిందీ సినిమాలతో పాటు టీవీ షోలలో కూడా నటించాడు.
ఇవి కూడా చదవండి:
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించిన ఆస్ట్రేలియా
నన్ను పట్టుకోగలిగితే పట్టుకోండి.. పంజాబ్ కింగ్స్‌పై ఇషాన్ కిషన్ సెటైర్..