Share News

చరిత్ర సృష్టించిన పాటిదార్‌.. అత్యంత వేగవంతమైన భారత బ్యాటర్..

ABN , Publish Date - May 23 , 2026 | 02:55 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ఓ భారీ ఐపీఎల్‌ రికార్డు సాధించాడు. లీగ్‌ చరిత్రలో అత్యంత వేగంగా (50 ఇన్నింగ్స్‌లు) 100 సిక్సర్లు పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

చరిత్ర సృష్టించిన పాటిదార్‌..  అత్యంత వేగవంతమైన భారత బ్యాటర్..
Rajat Patidar fastest 100 sixes

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ఓ అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. శుక్రవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను బాదిన ఏకైక సిక్సర్‌తో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. పాటిదార్ 50 ఇన్నింగ్స్‌ల్లో 100 సిక్సర్లు కొట్టాడు. గతంలో ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు శివమ్‌ దూబె పేరిట ఉండేది. సిక్సర్ల సెంచరీ పూర్తి చేసేందుకు దూబెకు 59 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.


ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్‌గా, ఈ రికార్డు విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. అతడు 37 ఇన్నింగ్స్‌ల్లోనే 100 సిక్సర్లు పూర్తి చేశాడు. విండీస్‌కే చెందిన ఆండ్రీ రసెల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. రసెల్‌ 100 సిక్సర్ల మార్కును 47 ఇన్నింగ్స్‌లు అందుకున్నాడు. వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో పాటిదార్‌ ఉన్నాడు. బంతుల పరంగానూ అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా పాటిదార్‌ మూడో స్థానంలో ఉన్నాడు. 100 సిక్సర్ల ఫీట్‪ను సాధించేందుకు పాటిదార్‌కు 933 బంతులు అవసరం కాగా.. రసెల్‌ 657 బంతులు, నికోలస్‌ పూరన్‌ 884 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ పాటిదార్‌ తర్వాతి స్థానంలో ఉండటం విశేషం. గేల్ 943 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు.


మ్యాచ్‌ విషయానికొస్తే..ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో 55 పరుగుల తేడాతో ఆర్సీబీ పరాజయంపాలైంది. గెలిచినా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంతో సరిపెట్టుకొని ఎలిమినేటర్‌ గండాన్ని తప్పించుకోలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎదుర్కోబోయే జట్టు ఇంకా ఖరారు కాలేదు. ఈ బెర్త్‌ కోసం రాజస్థాన్‌, పంజాబ్‌, కేకేఆర్‌, ఢిల్లీ పోటీపడుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

కృనాల్ పాండ్య బౌలింగ్‌కు షాకైన కావ్య.. వెంకీతో సీరియస్ డిస్కషన్!

చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ యువ పేసర్

Updated Date - May 23 , 2026 | 02:59 PM