న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు కీలక సభ్యుడి రాజీనామా..
ABN , Publish Date - Mar 23 , 2026 | 05:36 PM
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఓటమి తర్వాత న్యూజిలాండ్ క్రికెట్‌లో అసంతృప్తులు బయటపడ్డాయి. కివీస్ క్రికెట్ బోర్డు సభ్యుడు, మాజీ క్రికెటర్ డైన్ వాష్ తన పదవికి రాజీనామా చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్2026 ఫైనల్లో భారత్ చేతిలో న్యూజిలాండ్ ఓడిన సంగతి తెలిసిందే. కివీస్ జట్టును 96 పరుగుల తేడాతో టీమిండియా ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది. ఇక ఈ పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత న్యూజిలాండ్ క్రికెట్‌లో అసంతృప్తులు బయటపడ్డాయి. కివీస్ క్రికెట్ బోర్డు సభ్యుడు, మాజీ క్రికెటర్ డైన్ వాష్ తన పదవికి రాజీనామా చేశాడు. బోర్డు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల నేపథ్యంలో అతడు తన పదవి నుంచి తప్పుకొన్నట్లు సమాచారం.
కివీస్ క్రికెట్ బోర్డు కొత్త ఫ్రాంచైజీ ఆధారిత టీ20 లీగ్‌ను ప్రారంభించాలని ఇవాళ(సోమవారం) నిర్ణయించింది. అంతేకాకుండా బిగ్ బాష్ లీగ్‌లో న్యూజిలాండ్ ఆధారిత ఓ జట్టును చేర్చాలని బోర్డు ప్రతిపాదించింది. అయితే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం సభ్యుల మధ్య విభేదాలకు దారితీసిందని సమాచారం. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే డైన్ తన పదవికి రాజీనామా చేసి అందరికి షాకిచ్చాడు. బోర్డు తీసుకున్న నిర్ణయాలకు తాను మద్దతు ఇవ్వలేనని, పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావించానని డైన్ ఓ ప్రకటనలో తెలిపాడు.
ఈ లీగ్ కారణంగానే గతేడాది న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ కూడా పదవి నుంచి తప్పుకొన్నాడు. తాజాగా ఈ జాబితాలోకి డైన్ చేరాడు. కాగా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోలిస్తే ఐసీసీ నుంచి న్యూజిలాండ్‌కు వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఈ లోటును పూడ్చుకోవడానికే కొత్త లీగ్ ప్రారంభించాలని కివీస్ క్రికెట్ బోర్డు యోచిస్తోందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
పిల్లలకు ఆస్తులు పంచిన టీమిండియా మాజీ క్రికెటర్
పాకిస్థాన్ యువ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డు