Share News

టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ సరసన నేపాల్ క్రికెటర్

ABN , Publish Date - May 31 , 2026 | 06:17 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మరో పేరు చేరింది. నేపాల్ స్టార్ ఓపెనర్ కుషాల్‌ భుర్టెల్‌ ఈ ఘనతను సాధించాడు. పురుషుల ఆసియా క్రీడాల టీ20 క్వాలిఫయర్-2026లో టోర్నీలో భాగంగా చైనాతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భుర్టెల్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు.

టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ సరసన నేపాల్ క్రికెటర్
Kushal Bhurtel

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరు చెప్పగానే ఓ రికార్డు గుర్తుకు వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్‌గా యువీ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచ కప్ 2007లో భాగంగా సెప్టెంబర్ 19న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనత సాధించాడు. ఆ తర్వాత పలువురు ఆటగాళ్లు కూడా ఈ రికార్డును అందుకున్నారు. తాజాగా క్రికెట్ ప్రపంచంలో పసికూన అయినా నేపాల్ జట్టు నుంచి కూడా ఓ ప్లేయర్ ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు.


నేపాల్ స్టార్ ఓపెనర్ కుషాల్‌ భుర్టెల్‌ ఈ ఘనతను సాధించి, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. పురుషుల ఆసియా క్రీడాల టీ20 క్వాలిఫయర్-2026లో టోర్నీలో భాగంగా చైనాతో ఆదివారం (మే 31) జరిగిన మ్యాచ్‌లో భుర్టెల్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన భుర్టెల్ డ్రాగన్ కంట్రీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో చుయూయ్ చెన్ వేసిన ఆరు బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 43 బంతుల్లోనే 129 పరుగులు చేసి చైనా బౌలర్లపై దండయాత్ర చేశాడు.


భుర్టెల్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 16 సిక్సర్లు నమోదయ్యాయి. అనంతరం డెంగ్ జింకీ అతన్ని ఔట్ చేసినా అప్పటికే మ్యాచ్ పూర్తిగా నేపాల్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 313 పరుగుల అతి భారీ స్కోరు సాధించింది. 314 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చైనా ఆరంభం నుంచే ఒత్తిడికి గురైంది. నేపాల్ బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన ముందు చైనా బ్యాటింగ్ కుప్పకూలింది. చైనా జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌటైంది. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఓకే ఓవర్లలో ఆరు సిక్సర్ల ఘనతను హెర్షల్‌ గిబ్స్‌, యువరాజ్‌ సింగ్‌, కీరన్‌ పోలార్డ్‌, జస్కరన్‌ మల్హోత్రా, దీపేంద్ర సింగ్‌ ఎయిరీ సాధించారు.


కాగా, సింగపూర్‌ వేదికగా జరుగుతున్న పురుషుల ఆసియా క్రీడల టీ20 క్వాలిఫయర్-2026 టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడుతున్నాయి. నేపాల్‌, చైనా, ఖతార్‌, మలేసియా ఓ గ్రూప్‌-ఏలో ఉండగా.. బెహ్రెయిన్‌, హాంగ్‌కాంగ్‌, ఒమన్‌, సింగపూర్‌ గ్రూప్‌-బిలో పోటీపడుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 31 , 2026 | 06:22 PM