ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిక్కుల్లో పాక్ క్రికెటర్
ABN , Publish Date - Mar 28 , 2026 | 03:47 PM
పాకిస్థాన్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు పాక్ క్రికెటర్ నసీం షాను చిక్కుల్లో నెట్టాయి. అంతేకాక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సదరు ఆటగాడికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, వారి ఆటగాళ్లు తరచూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా పాక్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు ఓ పాక్ క్రికెటర్‌ను చిక్కుల్లో నెట్టాయి. అంతేకాక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సదరు ఆటగాడికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు, ఆయన చేసిన కామెంట్స్ ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం..
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) గురువారం(మార్చి 26) ప్రారంభమైన సంగతి తెలిసిందే. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యాచ్ వీక్షించాల్సిందిగా పంజాబ్(పాక్) సీఎం మరియం నవాజ్‌ను పీసీబీ ఆహ్వానించింది. ఈ క్రమంలో పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మన్ జట్ల ఫ్రాంఛైజీ యజమానులకు మరియంను పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లతో కూడా సీఎం మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమెకు అత్యంత గౌరవం ఇవ్వడంపై పాకిస్థాన్ స్టార్ పేసర్ నసీం షా అసహనం వ్యక్తం చేశాడు. ‘లార్డ్స్ (ఇంగ్లండ్ మైదానం)లో రాణిలా.. ఇక్కడ ఈమెను ఎందుకు అంత గొప్పగా చూస్తున్నారు? ఎందుకింత హడావుడి?’ అని నసీం షా ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. దీంతో వివాదం చెలరేగడమే కాకుండా అతడిని చిక్కుల్లో నెట్టింది. అతడికి పీసీపీ సైతం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన నసీం షా.. తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిందని సమర్థించుకున్నాడు. తాను ఎవరినీ ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశాడు. కాగా పీఎస్‌ఎల్‌లో నసీం షా రావల్పిండి పిండిజ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అలానే నసీం పాకిస్థాన్ తరఫున ఇప్పటి వరకు 20 టెస్టులు, 34 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ పేసర్ ఖాతాలో 60 టెస్టు వికెట్లు, 60 వన్డే వికెట్లు, 32 టీ20 వికెట్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!